హ‌స్తం నేత‌ల్లో సీట్ల లొల్లి!

మ‌హాకూట‌మి.. మ‌హాన‌టి సినిమాను మ‌రిపిస్తుంది. అక్క‌డ ఒక్క‌రే సావిత్రి. ఇక్క‌డ ఎంతోమంది సావిత్రులు. ఈ లెక్క‌న ఈ సినిమా హిట్టా.. ఫ‌ట్టా అంటే.. న‌వంబ‌రు వ‌ర‌కూ ఆగాల్సిందే. కేసీఆర్‌ను ఓడించేందుకు తలా ఒక చేయివేద్దాం.. ఐదేళ్ల పాటు అధికారానికి దూర‌మైన పార్టీలు.. నేత‌ల అంత‌ర‌గమే మ‌హాకూట‌మి. ఎందుకంటే… కేసీఆర్ ఉద్య‌మ‌నేత‌గా.. సీమాంధ్రుల ప‌ట్ల ఎలా వ్య‌వ‌హ‌రించారో.. అధికారం చేతికి చేరాక‌.. దాదాపు అన్ని పార్టీల‌ను తొక్కిప‌ట్టి నార‌తీశారు. నోరెత్తిన మీడియా గొంతుపిసికారు. దీంతో స‌రెండ‌ర్ అయినోళ్లంతా వంత‌పాడుతూ స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు. క‌సిపెంచుకున్న‌వాళ్లంతా కూట‌మిగా చేరారు. మిగ‌తా అంతా.. సేమ్‌టు సేమ్ అనాల్సిందే. అయితే.. కూట‌మితో ప‌వ‌ర్ వ‌స్తుంద‌నేది హ‌స్తం నేత‌ల ఆలోచ‌న‌. పైగా రాహుల్ కూడా మాంచి దూకుడు మీద ఉన్నాడు కాబ‌ట్టి.. మోదీపై ప్ర‌జా వ్య‌తిరేక‌త క‌ల‌సివ‌స్తుంద‌నే ఉద్దేశంతో మిగిలిన పార్టీల‌న్నీ చేయి గుర్తుకే జై కొట్టాయి. అంత‌వ‌ర‌కూ బాగాన ఉంది.
కానీ.. కూట‌మితో హ‌స్తం నేత‌ల్లో సీట్ల లొల్లి మొద‌లైంది. స‌ర్దుబాటులో భాగంగా కొన్నిసీట్లు.. కూట‌మిలోని మిగిలిన పార్టీల‌కూ కేటాయించాల్సిందే. మిగిలిన వాటిలోనే సీనియర్లు స‌ర్దుకోవాలి. కానీ. జానారెడ్డి, కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, అరుణ‌, పొన్నాల‌, ముఖేష్‌గౌడ్‌, అంజ‌న్‌కుమార్‌యాద‌వ్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 20 మంది సీనియ‌ర్ నేత‌లు ఒక్కోక‌రు రెండు సీట్లు కోరుతుండ‌టమే పార్టీకు మింగుడుప‌డ‌కుండా ఉంది. తాను అసెంబ్లీకు భార్య పార్ల‌మెంట్‌కు అంటూ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి లెక్క‌లే వేస్తున్నాడ‌ట‌. ఇక‌పోతే జానారెడ్డి త‌న‌యుడు ర‌ఘువీర్‌రెడ్డిని కూడా రంగంలోకి దింపుతున్నార‌ట‌. అదే లెక్క‌లో.. న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం, రంగారెడ్డి, హైద‌రాబాద్‌లోని కాంగ్రెస్ పెద్ద‌త‌లకాయ‌లు దాదాపు సీట్ల కేటాయింపుపై అదిష్ఠానంపై ఒత్తిడి పెంచుతున్నార‌ట‌. మొన్న‌టి వ‌ర‌కూ అభ్య‌ర్థులు దొరుకుతారా లేదా అని బాధ‌ప‌డి.. బెంబేలెత్తిన కాంగ్రెస్‌కు ఇంత డిమాండ్ పెరిగిందా అంటూ.. చివ‌ర‌కు సోనియ‌మ్మ కూడా భ‌లే ప‌రేషాన్ అయింద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చివ‌ర‌కు ఈ పంచాయ‌తీ రాహుల్ వ‌ద్దకు కూడా చేరుతుందంటున్నారు.
ఇక‌పోతే ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి వ‌ర్సెస్ కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ గొడ‌వ తారాస్థాయికి చేరింది. రెండుసార్లు షోకాజ్ నోటీసులు అందుకున్న రాజ‌గోపాల్‌రెడ్డి ఇక పార్టీను వీడిపోతార‌నే ప్రచారం జ‌రుగుతుంది. త‌మ మాట చెల్లుబాటు గాక‌పోవ‌టం.. పైగా.. క‌మిటీలో త‌మ వ‌ర్గానికి అన్యాయం జ‌ర‌గ‌టం కూడా బ్ర‌ద‌ర్స్‌ను బాధిస్తుంద‌ట‌. అందుకే.. పార్టీ వీడైనా స‌రే గుణ‌పాఠం చెప్పాల‌నుకుంటున్నాడ‌ట‌. ఇదే త‌ర‌హాలో హ‌స్తంలో మ‌రికొంద‌రు బ‌య‌ట‌ప‌డి.. గొడ‌వ చేస్తే.. తాము లాభ‌ప‌డవ‌చ్చ‌నేది గులాబీపార్టీ ఆలోచ‌న‌. అందుకే.. అక్క‌డ రెబ‌ల్‌గా మారి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారికి తాము ఆర్ధిక‌సాయం చేస్తామంటూ లోపాయికారి ఒప్పందం కూడా కుదుర్చుకుంటున్న‌ట్లు స‌మాచారం. నేను ఓడినా ప‌ర్లేదు కానీ.. వాడు మాత్రం నెగ్గ‌కూడ‌ద‌నే అక్క‌సుతో.. హ‌స్తం నేత‌లు పావులు క‌దిపితే.. కూట‌మికి ఎదురుదెబ్బ‌. టీఆర్ఎస్‌కు ఊహించ‌ని గెలుపు ఖాయ‌మంటూ రాజ‌కీయ విశ్లేష‌కుల జోస్యం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.