బాబుగారు.. ఏమిటీ సొంత‌గూటి పోరు!

చిత్తూరు జిల్లా 14 నియోజ‌క‌వ‌ర్గాలు.. 2014 ఎన్నిక‌ల్లో 8 చోట్ల వైసీపీ పాగా వేసింది. ఆరింట టీడీపీ గెలిచింది. అయితే.. ఏమైందీ.. చంద్ర‌బాబే  క‌దా! సీఎం నిజ‌మే. కానీ.. 2019లో ఈ ప్ర‌భావం ఇంకెలా ఉంటుంది. అందులోనూ.. అధికార ప్ర‌భుత్వంపై ఉండే వ్య‌తిరేక‌త ఉండ‌నే ఉంది. పైగా సొంత‌గూటిలో అంస‌తృప్తి నివురుగ‌ప్పిన నిప్పుగా ఉంది. మొన్న న‌గ‌రిలో నిన్న తిరుప‌తిలో వ్య‌తిరేక‌త బ‌య‌ట‌ప‌డ‌టం అధికార పార్టీను కంగారు పెడుతుంది. న‌గ‌రి నుంచి పోటీచేసి ఓడిన గాలి ముద్దు కృష్ణ‌మ‌నాయుడు మ‌ర‌ణంతో త‌న‌యుల మ‌ధ్య వార‌స‌త్వ పోరు ముదిరి పాకాన‌ప‌డింది. ఇద్ద‌ర‌న్న‌ద‌మ్ములు గొడ‌వ‌ల‌తో రోడ్డున ప‌డేంత వ‌ర‌కూ చేరారు. ఇప్ప‌టికే ఇక్క‌డ వైసీపీ నుంచి రోజా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తుంది. టీడీపీపై ఒంటికాలిపై లేవ‌టం.. ఘోర‌మైన కామెంట్స్‌తో నేత‌ల్ని ఇరుకున పెడుతున్నారు. కేవ‌లం 858 ఓట్ల మెజార్టీతో చేతులారా సీటు పొగొట్టుకున్నారు. దాదాపు ఆ జిల్లాలో నాలుగు చోట్ల టీడీపీ ఓట‌మికి ఓట్లు కేవ‌లం 1000 లోపు కావ‌టం మ‌రీ దారుణం.  ఇటీవ‌ల చేసిన స‌ర్వేలోనూ.. రోజా ప‌నితీరుపై ప్ర‌జ‌ల్లో సానుకూల‌తే ఉన్న‌ట్లు తేలింది. తిరుప‌తిలో సుగుణ‌మ్మ‌ప‌ట్ల కూడా పార్టీ అంటీఅంట‌న‌ట్టుగా ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. టీటీడీలో జ‌రిగే కార్య‌క్ర‌మంలో సుగుణ‌మ్మ‌కు లోక‌ల్ ఎమ్మెల్యేగా స‌రైన గుర్తింపు ద‌క్క‌ట్లేద‌నే ఆరోప‌ణుంది.
ఇటీవ‌ల మ‌హాసంప్రోక్ష‌ణ స‌మ‌యంలోనూ ఆమెను లోప‌ల‌కు అనుమ‌తించ‌లేదు. దీనిపై స్వ‌యంగా సీఎం బాబు రంగంలోకి దిగి ప‌రిష్క‌రించాల్సి వ‌చ్చింది. ఇదే త‌ర‌హాలో చిత్తూరు, ప‌ల‌మ‌నేరు, శ్రీకాళ‌హ‌స్తి, స‌త్య‌వేడు, పుంగ‌నూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదే త‌ర‌హా కుమ్ములాట‌లున్నాయి. గ‌తంలో ప‌లుమార్లు నేత‌ల‌ను పిలిపించి స‌యోధ్య కుదిర్చినా తీరు మార‌లేదంటూ.. చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తంచేయ‌టం ఇందుకు నిద‌ర్శ‌నం. ఎన్నిక‌లు ఏ స‌మ‌యాన ప‌లుక‌రిస్తాయో తెలియ‌ని అయోమ‌యంలో అధికార పార్టీ అధినేత సొంత‌జిల్లాలోనే సాగుతున్న త‌ల‌నొప్పులు.. మిగిలిన చోట్ల కూడా ప్ర‌భావం చూపుతాయ‌నే ఆందోళ‌న లేక‌పోలేదు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.