పవన్‌కు ఛాలెంజ్ విసిరిన చిరంజీవి

కాంగ్రెస్ మాజీ ఎంపీ, ప్రముఖ సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు ఛాలెంజ్ విసిరారు. ఆగాగండి.. ఇదేదో రాజకీయాలకు సంబంధించినది అనుకునేరు. అంతలేదులేండి.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న ‘హరితహారం’ కార్యక్రమంలో భాగంగా బాగా పాపులర్ అయిపోయిన గ్రీన్ ఛాలెంజ్‌కు సంబంధించిన సవాలు. అంటే ఒక ప్రముఖుడు ఓ మొక్కను నాటడం.. దానిని వారు సోషల్ మీడియాలో పోస్టు చేసి, మరో ముగ్గురికి ఛాలెంజ్ విసరడం అన్నమాట. తెలంగాణ హరితహారం కింద కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయారు. ఎన్టీవీ అధినేత చౌదరి విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన చిరంజీవి, తన ఇంటి పెరటిలో మొక్కలను నాటారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు.

ఛాలెంజ్‌ను పూర్తి చేసిన చిరు.. మరో ముగ్గురు ప్రముఖులకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో పాటు తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌లను ఆయన నామినేట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఎన్టీవీ చౌదరి గారి ఛాలెంజ్‌ను యాక్సెప్ట్ చేశా. ఇందులో భాగంగా మా ఇంటి పెరట్లో మూడు మొక్కలను నాటాను. ఈ సందర్భంగా నేను మరో ముగ్గురు ప్రముఖులను ఎంచుకుని… నేను వాళ్లను నామినేట్ చేస్తున్నాను. ఆ ప్రముఖులెవరో కాదు. అమితాబ్ బచ్చన్ జీ, పెద్దలు రామోజీరావుగారు, నా తమ్ముడు పవన్ కల్యాణ్. వీళ్లు ముగ్గురు నా ఛాలెంజ్‌ను యాక్సెప్ట్ చేస్తారని ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతారని ఆశాభావంతో ఉన్నాను. అమితాబ్ బచ్చన్ జీని నామినేట్ చేస్తున్నాను. సార్ ప్లీజ్ గ్రీన్ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేయండి. ఇండియా మిమ్మల్ని ఫాలో అవుతుంది’’ అని పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.