బీఎస్పీపై బాబు కన్ను… ఎందుకంటే?

ఆంధప్రదేశ్ సీఎం చంద్ర‌బాబునాయుడు భిన్న‌మైనశైలి కలిగిన రాజ‌కీయ నాయ‌కుడు. ఆయ‌న సుదీర్ఘ‌చ‌రిత్ర‌కు ఇది తార్కాణంగా నిలుస్తుంది. ప్ర‌త్య‌ర్థుల‌ను నేరుగా ఎదుర్కొవాలో, ఇత‌రుల స‌హాయంతో పోటీ ప‌డాలో లేక ప్ర‌త్య‌ర్థి శిబిరంలో చిచ్చు రేపి పై చేయి సాధించాలో అనేది కొందరు నేతలకు మాత్రమే తెలుస్తుంది. చంద్ర‌బాబు ఇలాంటి అనేక మార్గాలను అవ‌లంభించ‌డంలో ఆరితేరిన నాయ‌కుడని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తుంటారు. తాజాగా ఉండ‌వ‌ల్లి కూడా పోల్ మేనేజ్ మెంట్ లో చంద్రబాబుకి తిరుగులేద‌ని తేల్చి చెప్పారు. తాజాగా ఏపీలో త‌న వ్యూహాల అమ‌లుకోసం చంద్ర‌బాబు బహుజన సమాజ్ పార్టీని ప్రోత్స‌హించే ప‌నిలో ఉన్నార‌నే ప్ర‌చారం వినిపిస్తోంది. ముఖ్యంగా సామాజిక స‌మీక‌ర‌ణాల రీత్యా చూస్తే సుదీర్ఘ‌కాలంగా ఎస్సీలు చంద్ర‌బాబుకు దూరంగా ఉన్నారు. వ‌ర్గీక‌ర‌ణ అంశం తెర‌మీద‌కు వ‌చ్చిన నాటి నుంచి బాబుపై మాల‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్న విషయం విదితమే! గ‌డిచిన ఎన్నిక‌ల్లో మెజార్టీ ఎస్సీ రిజ‌ర్వుడు సీట్లు టీడీపీకే ద‌క్క‌డం ఆశ్చ‌ర్య‌ం కలిగించే అంశం. అయిన‌ప్ప‌టికీ ఎస్సీల ఓట్లలో మెజార్టీ శాతం జ‌గ‌న్ వైపు ఉన్నాయని తేలింది.
దాంతో వారి ఓట్లు చీల్చే ల‌క్ష్యంతో చంద్రబాబు కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీఎస్పీని ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. త‌ద్వారా మాయావ‌తి నాయ‌క‌త్వంలోని బీఎస్పీ సాయంతో విద్యావంతులైన ఎస్సీల ఓట్ల‌ను చీల్చేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్ప‌టికే బీజేపీ- జ‌గ‌న్ బంధం గురించి టీడీపీ ప్రచారం చేస్తోంది. త‌ద్వారా క్రిస్టియ‌న్ యూత్ లో జగన్ పార్టీపై అనుమానాలు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇదే తగిన సమయంగా భావిస్తూ బీఎస్పీని బ‌రిలో దింపాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. తద్వారా జ‌గ‌న్ పై అసంతృప్తితో ఉన్నవారి ఓట్ల‌ను టీడీపీ వైపు మ‌ర‌లించే వ్యూహం ఉంద‌నే వాదన వినిపిస్తోంది. బాబు ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తే జగన్ పార్టీ ఓట్లకు గండిప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ ఎత్తులను చిత్తు చేయడానికి జ‌గ‌న్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో వేచిచూడాల్సిందే!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.