ధీటైన వ్యూహాల దిశగా చంద్రబాబు

ఏపీ రాజకీయాలు రసకందాయంలో సాగుతున్నాయి. అధికారంలో వున్న టీడీపీ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో మళ్ళి అధికారాన్ని ఎలా దక్కించుకోవాలనేదానిపై వ్యూహరచన చేస్తుంటే, మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి  ప్రజా సంకల్ప యాత్ర చేపడుతూ, అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు దూసుకువెళుతున్నారు. ఇంకోవైపు రాబోయే ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగాలని చూస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రజా పోరాట యాత్రల పేరుతో ప్రజలకు చేరువ అవుతున్నారు. ఈ నేపధ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు మరింత బలమైన వ్యూహంతో ముందుకు సాగేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. టీడీపీ అధికారాన్ని చేపట్టి నాలుగేళ్లు పూర్తి అయినప్పటికీ ప్రజల్లో ఆ పార్టీపై కొంతమేరకు అసంతృప్తి ఉందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఎన్డీయేలో భాగస్వామ్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీకి అన్నివిధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే రాష్ట్రానికి విభజన హామీలు, ప్రత్యేక హోదా కూడా ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే మొదట్లో హోదా అని చెప్పిన బీజేపీ నేతలు ఆ తరువాత దాని స్థానంలో ప్రత్యేక ప్యాకెజీని ప్రకటించిన విషయం విదితమే. అయితే అప్పటినుండి ఆ అంశం రాజకీయ రంగుపులుముకుంది. ప్యాకెజీకి ఒప్పుకున్ననాటినుండి ఏపీకి ఇస్తానన్న నిధులు విడుదల జరగడం లేదని టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది. అలాగే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏపీని పైకి ఎదగనీయకుండా అడ్డుకట్ట వేస్తోందని టిడిపి విమర్శిస్తోంది. ఈ నేపధ్యంలోనే ఎన్డీయే నుండి తెగతెంపులు చేసుకుని బయటకు వచ్చిన టీడీపీ, ఆ తరువాత బిజేపిపై లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. 
అయితే అవిశ్వానికి కావలసినంత మంది సభ్యుల మద్దతు లేకపోవడంతో అది వీగిపోయింది. దీంతో టిడిపి, బీజేపీ నాయకులపై బహిరంగంగానే మాటల యుద్దానికి దిగుతోంది. ఇక ఈ అంశం నేపధ్యంలో ముఖ్యంగా ఏపీలో టిడిపిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి దీనికితోడు రైతులను, మహిళలను బాబు ప్రభుత్వం పూర్తిగా దగా చేసిందని, ఏవో అరకొర కార్యక్రమాలతో అయన ప్రభుత్వం మళ్ళి అధికారాన్ని చేపట్టాలని చూస్తోందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి. అయితే టీడీపీ నేతలు ప్రత్యేక హోదా, విభజన హామీలు విషయమై అవి సాధించేవరకు పోరాడుతూనే ఉంటామని చెబుతున్నారు. అయితే ఈ రెండు కీలక అంశాలే రాబోయే ఎన్నికల్లో టిడిపికి కొంత సమస్య తెచ్చి పెట్టేలా కనపడుతున్నాయి. ఈ నేపద్యంలోనే చంద్రబాబు మరింత బలమైన మ్యానిఫెస్టోని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. దీనికితోడు ఈ సారి ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవడానికి టీడీపీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. అయితే ఎన్నికల నాటికి రాజకీయాలు ఎలా మారుతోయో వేచి చూడల్సిందే!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.