ఐరాస‌లో బాబు స్పీచ్‌…విన్నారా?

  • ఐరాస‌లో `తెలుగు`వాణి వినిపించిన చంద్ర‌బాబు!
  • ఐరాస‌లో `అన్న‌పూర్ణాంధ్ర‌ప్ర‌దేశ్`ను ఆవిష్క‌రించిన చంద్ర‌బాబు!
  • ఐరాస‌లో `ప్ర‌కృతి సేద్యం`పై చంద్ర‌బాబు కీల‌కోప‌న్యాసం!
ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే అరుదైన అవకాశం దక్కిన సంగ‌తి తెలిసిందే. వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం, బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరంల‌ ఆధ్వర్యంలో ‘సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత: అంతర్జాతీయ సవాళ్లు-అవకాశాలు’ అనే అంశంపై ప్రసంగించాల్సిందిగా చంద్రబాబుకు ఆహ్వానం అందిన విష‌యం విదిత‌మే. ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి ప‌లు దేశాల‌కు చెందిన నేత‌లు పాల్గొన్న ఈ ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మంలో తెలుగు వాణి వినిపించేందుకు చంద్ర‌బాబుకు అవ‌కాశం ద‌క్కింది. ఎంతోమంది ప్ర‌ముఖులున్న ఆ వేదిక‌పై చంద్ర‌బాబు గురించి….ఆ కార్య‌క్ర‌మ వ్యాఖ్యాత గొప్ప‌గా అభివ‌ర్ణించారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన విజేతలలో ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక‌ర‌ని ఆయ‌న అన్నారు. ఇండియాలో చంద్రబాబు ఒక ఐకానిక్ లీడర్ అని కొనియాడారు.  ప్రపంచంలోని ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయుల‌ని, ఆ నలుగురు ఐటీ ఎక్స్ పర్ట్స్ లో ఒకరు ఏపీకి చెందిన వారని కితాబిచ్చారు. భార‌త జ‌నాభాలో కేవ‌లం నాలుగు శాతం జ‌నాభా ఉన్న ఏపీ నుంచి….దేశ ఐటీ నిపుణుల్లో 25 శాతం ప్రాతినిధ్యం ఉంద‌న్నారు. ఐటీ రంగంలో ఏపీ ప్ర‌గతికి చంద్ర‌బాబు ఎంతో కృషి చేశార‌న్నారు. చంద్ర‌బాబు లీడర్ షిప్ కు, ఛాంపియన్ షిప్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఆయ‌న‌ను ప్ర‌సంగించాల్సిందిగా కోరారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్ర‌బాబు ఎన‌లేని కృషి చేస్తున్నార‌ని, ఏపీ, ఇండియాల‌తో పాటు వీలైతే ప్రపంచ భవిష్యత్తును కూడా చంద్ర‌బాబు మార్చగల‌రని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.
తెలుగువాడి నాడిని ప్ర‌పంచ దేశాల‌కు వినిపించేందుకు చంద్ర‌బాబు తన ప్రసంగాన్ని`తెలుగు`లో ప్రారంభించారు. త‌న‌కు ఇదో అరుదైన ఘ‌ట్ట‌మ‌ని, ఐరాస‌లో తెలుగు ప్ర‌జ‌ల‌ను రిప్ర‌జెంట్ చేయ‌డం చాలా గ‌ర్వంగా ఉంద‌న్నారు. అందులోనూ, అన్న‌పూర్ణ‌గా పేరుపొందిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్య‌వ‌సాయం గురించి ప్ర‌సంగించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. రెండు దశాబ్దాలుగా టెక్నాల‌జీపై తాను ఎంతో కృషి చేశాన‌ని, ప్రపంచం గ‌ర్వించ‌ద‌గ్గ స్థాయిలో తెలుగు సాఫ్ట్ వేర్ నిపుణుల‌ను అందించాన‌ని చెప్పారు. వ్య‌వ‌సాయానికి సాంకేతిక జోడించేందుకు కృషి చేస్తున్నాన‌ని చెప్పారు. రసాయన ఎరువుల వాడకం వల్ల పంట దిగుబడుల్లో నాణ్యత లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ర‌సాయ‌న ఎరువుల వ‌ల్లే అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.అందుకే, ప్ర‌కృతి సేద్యాన్ని ప్రోత్స‌హిస్తున్నామ‌న్నారు. రైతులకు ఖర్చును తగ్గించి చీడపీడలు లేని కాలుష్య రహిత సాగును ప్రోత్సహించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్నారు. అమ్మ జన్మ మాత్రమే ఇస్తే.. భూమి….ఆహారంతోపాటు అన్నీ ఇస్తోందన్నారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం వల్లే రైతులకు పెట్టుబడి తగ్గుతుందన్నారు. ఇప్పటికే లక్షల ఎకరాల్లో ప్ర‌కృతి వ్య‌వ‌సాయం చేస్తున్నామ‌ని, 2029 నాటికి 20 లక్షల ఎకరాలకు ఈ విస్తీర్ణాన్ని పెంచాలని యోచిస్తున్నామ‌న్నారు. భార‌త్ లో ప్రకృతి సేద్యంలో నవ్యాంధ్ర అగ్రగామిగా ఎదిగింద‌ని, ఏపీ సాధిస్తున్న విజయాలను అక్క‌డి వారికి వివరించారు. ఈ సమావేశంలో కీలక ప్రసంగాలు చేసిన తొమ్మిది మందిలో చంద్రబాబు ఒకరు కావడం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.