బాబూ.. కాస్త వారివైపు చూడు: అప్ర‌మ‌త్తం చేస్తున్న నేత‌లు

సాధార‌ణంగా ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌ప్పుడు పార్టీలో చురుకైన‌ నేత‌లు ఎవ‌రున్నారు, ఎవ‌ర్ని చేర్చుకోవాలి అనే వ్యూహల‌తో పార్టీ అధినేత‌లు ముందుకు క‌దులుతుంటారు. అయితే ఈ విష‌యంలో టీడీపీ ఈ మ‌ధ్య కాస్త వెనుక‌బ‌డింద‌న్న‌ అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. టీడీపీలో చేరేందుకు వ‌స్తున్న నేత‌ల విష‌యంలోనూ, పార్టీలో అసంతృప్తిగా ఉంటున్న‌వారిని  బుజ్జ‌గించ‌డంలోనూ  చంద్ర‌బాబు  కాస్త జాప్యం చేస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ విష‌యంలో జ‌గ‌న్‌ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌న్న‌ అభిప్రాయాన్ని టీడీపీ శ్రేణులు వ్య‌క్తం చేస్తున్నాయి. గ‌తంలో వైఎస్ఆర్ సీపీ నుంచి ఎమ్మెల్యేల‌ను టీడీపీ ఆక‌ర్షించి పార్టీలో చేర్చుకుంది. అయితే నియోజ‌క వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగే అవ‌కాశం ఇప్ప‌ట్లో క‌నిపించ‌క‌పోవ‌డంతో చేరిక‌ల‌కు చంద్ర‌బాబు బ్రేక్ వేసిన‌ట్లు తెలుస్తోంది అయితే ఈ కార‌ణంతో కొంత‌మంది కీల‌క నేత‌ల్ని దూరం చేసుకోవ‌డం త‌గ‌ద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం బీజీపీ అధ్య‌క్షుడిగా ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఆ మ‌ధ్య టీడీపీలో చేరేందుకు ముందుకు వ‌చ్చార‌ట‌! ఆ స‌మ‌యంలో టీడీపీ అధిష్టానం చురుగ్గా వ్య‌వ‌హ‌రించి ఉంటే ఆయ‌న ఇటువైపే వ‌చ్చేవార‌ని టీడీపీ వ‌ర్గాలే  అంటున్నాయి! దీనికితోడు విశాఖ‌కు చెందిన ఓ సీనియ‌ర్ నాయకుడు కూడా టీడీపీవైపు కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్నార‌ట‌! దీంతో ఆయ‌న ఎటూ తేల్చుకోలేక‌ వేరే పార్టీవైపు మొగ్గుచూపుతున్న‌ర‌ని స‌మాచారం. ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి విష‌యంలోనూ టీడీపీ కాస్త చురుగ్గా స్పందించి ఉంటే ఆయ‌న ఈ పార్టీలోనే ఉండేవార‌నీ అంటున్నారు. అలాగే ప్ర‌కాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి మ‌హీధ‌ర్ రెడ్డి తెలుగు దేశంలో చేరనున్నారంటూ గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. ఈయ‌న విష‌యంలోనే టీడీపీ జాప్యం చేసింద‌ని ఆ పార్టీ నేత‌లే చెబుతున్నారు. కాగా ఇలాంటి ప్ర‌ముఖ నేత‌లు ప‌లు జిల్లాల్లో ఉన్నార‌నీ, వారిపై చంద్ర‌బాబు దృష్టి సారిస్తే బాగుంటుంద‌ని టీడీపీ నేత‌లు సూచిస్తున్నారు. లేని ప‌క్షంలో ఇలాంటి వారు ఇత‌ర పార్టీల్లో చేరే అవ‌కాశ‌ముంద‌ని వారు అంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.