దావోస్ ను పెట్టుబడుల దారిగా మార్చే వ్యూహంలో చంద్రబాబు

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఈ నెల 23 నుంచి 26 వరకు 48వ గ్లోబల్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరగనుంది. భారత్ తో పాటు.. ప్రపంచంలోని చాలా దేశాల ఆర్థిక వేత్తలు, నిపుణులు, వివిధ రంగాలకు చెందిన వారు ఆ సదస్సుకు హాజరవుతున్నారు. మిగతా వారితో పాటు… ఆంధ్రప్రదేశ్ సి.ఎం చంద్రబాబునాయుడుకు ఆ సదస్సు ఆహ్వానం పంపింది. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తోపాటు.. దేశంలోని చాలా రాష్ట్రాలకు చెందిన వారు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. 
మేక్‌ ఆంధ్రప్రదేశ్‌ యువర్‌ బిజినెస్‌ అన్న స్లోగన్‌ తో అక్కడ అడుగు పెట్టనున్నారు సి.ఎం చంద్రబాబునాయుడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ లోగోలతో ఇప్పటికే అక్కడ బస్సు పై పెయింటింగ్ వేసి మరీ తిప్పుతున్న సంగతి తెలిసిందే. సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరిట, విదేశీ పెట్టుబడుల సాధన కోసం చంద్రబాబు ఎకనామిక్‌ ఫోరమ్ ను ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు ద్వైపాక్షిక సమావేశాలు, సీఈవోల స్థాయిలో రౌండ్ టేబుల్ మీటింగ్స్, ముఖాముఖి చర్చలు జరపనున్నారు. అదే సమయంలో సదస్సులో ప్రసంగించనున్నారు. 
మరోవైపు వివిధ కంపెనీల ప్రతినిధులతో అవగాహన ఒప్పందాలు చేసుకోనున్నారు చంద్రబాబు. ఫ్రాన్ హోఫర్-ఏపీఈడీబీ మధ్య ఒక అవగాహన ఒప్పందం, హిటాచీతో మరో ఎంవోయూ, జ్యురిచ్‌తో సిస్టర్ సిటీ ఒప్పందం చేసుకునేందుకు సిద్దమయ్యారు. ఈనెల 23న గ్లోబల్ సీఈవోలతో బ్రేక్ ఫాస్టు సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఏపీ-జపాన్ డిన్నర్ సమావేశంలోను ముఖ్యమంత్రి పాల్గొని పెట్టుబడుల గురించి ప్రస్తావించనుండటం విశేషం. 
ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ సెంటర్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రారంభ సమావేశంలో పాల్గొని ప్రసంగించడమే కాదు.. క్రిస్టల్ అవార్డుల ప్రదాన వేడుకలో పాల్గొంటారు. అదేరోజు డీఐపీపీ ఏర్పాటు చేసే ఇండియా రిసెప్షన్‌కు హాజరవుతారు. తెల్లారి ఏపీ లాంజ్‌లో జరిగే ప్రారంభ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనడం ఒక ఎత్తయితే… దావోస్ సదస్సు కు హాజరయ్యే భారత ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. ప్రసంగం అయ్యాక మిగతా రాష్ట్రాలతో పాటు… ఏపీ లాంజ్‌ను సందర్శించనున్నారు మోడీ. 
అంతే కాదు… ఆ రోజు బజాజ్ గ్రూప్ నైట్ క్యాప్ ఆధ్వర్యంలో డిన్నర్ రిసెప్షన్‌కు చంద్రబాబు హాజరవుతారు. మూడోరోజు మధ్యాహ్నం 12 గంటలకు హోటల్ బెల్విడర్‌లో లంచ్ ఆన్ సమావేశం. ‘టెక్నాలజీస్ ఫర్ టుమారో’ అనే అంశంపై  టెక్నాలజీలో వినూత్న ఆవిష్కర్తలతో చర్చాగోష్టిలో చంద్రబాబు మాట్లాడనున్నారు. ఆ తర్వాత జరిగే సిఐఐ సీఈవోలతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ప్యానలిస్టుగా ముఖ్యమంత్రి హాజరవుతారు. కాంగ్రెస్ సెంటర్‌లో స్టివార్డ్స్ బోర్డు మీటింగ్. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సిస్టం ఇనీషియేటివ్ సౌజన్యంతో జరిగే ‘షేపింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ అగ్రికల్చర్’ అనే అంశంపై జరిగే చర్చలోను ముఖ్యమంత్రి ప్యానలిస్టుగా పాల్గొననున్నారు. యుయన్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హేయిన్‌తో లంచ్ మీటింగ్ లో ఏపీలో జరిగే ప్రకృతి వ్యవసాయం కోసం చేపట్టిన చర్యలను, సాధించిన ప్రగతిపై చర్చిస్తారు.
బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ చైర్మన్ షేక్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ఏర్పాటు చేసిన డిన్నర్ సమావేశంలోనూ చంద్రబాబు పాల్గొంటారు. చంద్రబాబుతో పాటు… మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, వ్యవసాయ సలహాదారు విజయకుమార్, ఈడీబీ సీఈవో జె కృష్ణకిశోర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆరోఖ్యరాజ్ తదితరులు ముఖ్యమంత్రితో పాటు వెళ్లే బృందంలోని సభ్యులు. 
దావోస్ లో పెట్టుబడుల కోసం ముందు నుంచి వ్యూహత్మకంగానే కదులుతోంది ఏపీ సర్కార్. అందుకే అక్కడ బస్సుల పై ప్రచారం చేయిస్తోంది. ఇంకోవైపు తెలంగాణ నేతలు అక్కడకు పయనం కావడం ఆసక్తికరమే. ఏపీ, తెలంగాణ ఐటీ మంత్రులిద్దరు ఒకే సమావేశంలో పాల్గొననుండటం ఆసక్తికర పరిణామమే.  
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.