అధికార సాధనకు బాబు ఏం చేస్తున్నారంటే?

మ‌రో ఏడెనిమిది నెల‌ల్లో ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను అటు అధికార‌, ఇటు విప‌క్ష పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని, గెలుపు గుర్రం ఎక్కాల‌ని ఉవ్విళ్లూరుతున్నాయి. అధికారాన్ని తిరిగి నిల‌బెట్టుకునేందుకు చంద్ర‌బాబు, అధికారంలోకి రావాల‌ని జ‌గ‌న్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాబోయే ఆరు నెలల్లో 50 కార్యక్రమాల ద్వారా ప్రజల మధ్య ఉండేలా చంద్రబాబు కార్యాచరణ రూపొందించుకుంటున్నారని తెలుస్తోంది. వారంలో రెండు రోజులు జిల్లాల పర్యటనలు ఉండేలా కార్యక్రమం తయారవుతోందని సమాచారం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామదర్శిని కార్య‌క్ర‌మాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. దీనిలో బాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ముఖ్యులు గ్రామాలకు వెళ్లి అక్కిడి ప్రజలను కలుసుకొని వారి బాగోగులు తెలుసుకొంటున్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
అలాగే బాబు ప్రజల నాడి తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘ఎక్కడ లోటు పాట్లున్నాయి? వాటిని ఎలా సరిదిద్దాలి? ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?’ అనే కోణంలో ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి చేరికల వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కింది స్ధాయి బూత్‌ కమిటీలు మొదలుకొని పైస్థాయి నేతల వరకూ అందరూ ప్రజల మధ్య ఉండేలా చూసుకోగలిగితే వచ్చేఎన్నికల్లో విజయం సాధించవచ్చన్న అంచనాతో పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు. ఇలా ప్రజా ప్రతినిధులు, అధికారులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలేమిటో తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయడం వల్ల ప్రభుత్వంపై సానుకూలత పెరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత పలచబడుతుందని టీడీపీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయని తెలుస్తోంది. మరి చంద్రబాబు ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.