చంద్రబాబు స్టామినా నిరూపించే పరిణామం బయటకొచ్చింది

నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. రాష్ట్రంలోనే కాదు.. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన సందర్భాలు కోకొల్లలు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి.. దేశానికే రాష్ట్రపతిని ఎంపిక చేసిన చాణక్యుడు. ఈ పాటికే ఆయన ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. అవును.. ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యార్థి స్థాయి నుంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబు.. చిన్న వయసులోనే ఎమ్మెల్యే, మంత్రి అయ్యారు. ఇక అప్పటి నుంచి ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో కీలక ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొమ్మిది సంవత్సరాలు పని చేసిన ఆయన జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పగలిగారు. ఇలాంటి నేత స్టామినా తెలిపే పరిణామం ఒకటి ఇటీవల జరిగింది. పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన పనికట్టుకుని మరీ వచ్చి చంద్రబాబు నుంచి పలు సూచనలు, సలహాలు తీసుకున్నారట. ఇప్పుడీ వార్త చంద్రబాబు అభిమానులకు తెగ ఖుషీ చేస్తోంది. కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఇటీవల ఏపీలో పర్యటించిన విషయం తెలిసిందే. కుటుంబంతో సహా విజయవాడ వచ్చిన ఆయన దుర్గమ్మను దర్శించుకుని, చంద్రబాబుతో భేటీ అయ్యారు.

ఆయన తన కుమారుడి పెళ్లి సంబంధం గురించి వచ్చారని ప్రచారం జరిగింది. అయితే, కుమారస్వామి వచ్చింది మాత్రం అందుకు కాదట. ప్రసుత్తం కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్న విషయం తెలిసిందే. ఏ ముహుర్తాన కాంగ్రెస్-జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయోగానీ, అప్పటి నుంచి కలహాలు, అసంతృప్తులతో ప్రభుత్వం సవ్యంగా సాగడంలేదు. ఎన్నో వివాదాలు, మరెన్నో విమర్శల నడుమ కుమారస్వామి పాలన సాగిస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయమై చంద్రబాబును కలిశారని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సుమారు అరగంట సేపు భేటీ జరిగింది. ఈ సందర్భంగా సంకీర్ణ ప్రభుత్వ నిర్వహణలోని సాధకబాధకాలను, కాంగ్రెస్‌తో ప్రస్తుతం ఏర్పడుతున్న కలహాలను కుమారస్వామి ప్రస్తావించారని సమాచారం. గతంలో యునైటెడ్ ఫ్రంట్ ఛైర్మన్‌గా చంద్రబాబు వ్యవహరించినప్పుడు ప్రాంతీయ పార్టీలను ఎలా మేనేజ్‌ చేశారో అడిగి తెలుసుకున్నారని టాక్. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య కలహాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనీ, ప్రభుత్వాన్ని పడగొడతామని యడ్యూరప్ప సవాలు చేస్తున్నారనీ కుమారస్వామి బాబుకు చెప్పుకొచ్చారట. ఈ సమస్యలన్నీ విన్న చంద్రబాబు ఆయనకు కొన్ని సలహాలు ఇచ్చారని వినికిడి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.