విజయంపై చంద్రబాబు, రాహుల్ ధీమాకు కారణం ఇదేనట

ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో దాదాపు డెబ్బై శాతం కంటే ఎక్కువే పోలింగ్ శాతం నమోదైంది. అంతే గత ఎన్నికల కంటే ఎక్కువన్నమాట. ఎన్నికలు ముగియడంతో జాతీయ స్థాయి సర్వే సంస్థలతో పాటు, స్థానిక సంస్థలు కూడా ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో జరిగిన ఎన్నికలపై పలు సంస్థలు విడుదల చేసిన సర్వే ఫలితాలు తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా వచ్చాయి. మరోవైపు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే సర్వే ఫలితాలను వెల్లడిస్తానని కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. అసలే సర్వేల్లో లగడపాటి రాజగోపాల్ చేయించే వాటికి ఓ ప్రత్యేకత ఉంది. ఆయన జోస్యం చెప్పారంటే అవి చాలాసార్లు పక్కాగా కరెక్ట్ అని తేలాయి. అందుకే ఆయనను ఆంధ్రా ఆక్టోపస్ అంటారు. గతంలో ఎన్నో ఎన్నికలకు సర్వే చేయించిన ఆయన.. తాజాగా తెలంగాణలో కూడా సర్వే నిర్వహించారు. దీంతో ఆయన సర్వే కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. అందుకే లగడపాటి గతంలో చెప్పిన సమయానికే మీడియా ముందుకు వచ్చారు. తన సంస్థ ఆర్జీ ఫ్లాష్ సర్వే ఆధారంగా విజేతలెవరో తేల్చేశారు.

తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ప్రజాకూటమిదే విజయమని మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు. ఆయన నిర్వహించిన సర్వే ఫలితాలను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఆయన సర్వే ప్రకారం కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గతంలో చెప్పనట్లుగానే రాష్ట్రంలో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధిస్తున్నారన్నారు. కాకపోతే రెండు రోజులుగా రాష్ట్రంలో జరిగిన ప్రలోభాలు, సెంటిమెంట్, జాలీ తదితర అంశాల ప్రభావం వల్ల ఫలితాల్లో స్వల్ప తేడాలు వచ్చాయన్నారు. ఈ కారణంగానే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కచ్చితంగా చెప్పలేమన్నారు. మొత్తంగా ప్రజాకూటమికి 65(పది పెరగొచ్చు.. పది తగ్గొచ్చు), తెలంగాణ రాష్ట్ర సమితికి 35(పది పెరగొచ్చు.. పది తగ్గొచ్చు) సీట్లు వచ్చే అవకాశాలున్నాయని లగడపాటి తెలిపారు. అలాగే స్వతంత్రులు 7(రెండు పెరగొచ్చు.. రెండు తగ్గొచ్చు), బీజేపీ 7(రెండు పెరగొచ్చు.. రెండు తగ్గొచ్చు), టీడీపీ 5(రెండు పెరగొచ్చు.. రెండు తగ్గొచ్చు) సీట్లలో విజయం సాధించవచ్చని చెప్పారు. మజ్లీస్ పార్టీకి మాత్రం ఆరు నుంచి ఏడు స్థానాలు, బీఎల్ఎఫ్ ఒక స్థానంలో విజయం సాధించే చాన్స్ ఉందని లగడపాటి అన్నారు.

మరోపక్క, లగడపాటి సర్వేపై అన్ని పార్టీలతో పాటు తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ మాత్రం లైట్ తీసుకున్నారట. దీనికి కారణం ఈ సర్వే ఫలితాలను లగడపాటి వాళ్లకు రెండు రోజుల ముందే వెల్లడించారని సమాచారం. ఇటీవల హైదరాబాద్‌లో రాహుల్, చంద్రబాబును ఆయన కలిశారు. దీనిని మీడియా హైలైట్ చేయలేదు. అప్పుడే ఈ ఫలితాలను వాళ్లిద్దరికీ వినిపించారని తెలిసింది. దీని వల్లే ఇటీవల తెలంగాణలో జరిగిన ప్రచార సభల్లో చంద్రబాబు, రాహుల్ ప్రజాకూటమి విజయంపై దీమాను వ్యక్తం చేశారు. వీళ్లిద్దరే కాదు కూటమిలోని ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలకు కూడా సర్వే ఫలితాలు అందాయని తెలుస్తోంది. మరి, ఇవే ఫలితాలు నిజమవుతాయో, వేరే ఫలితాలు వస్తాయో మాత్రం తెలియాలంటే డిసెంబర్ 11 వరకు వేచి చూడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.