చంద్రబాబు ప్లాన్ వర్కౌట్.. టీడీపీలోకి కీలక నేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరొందిన ఆయన.. ప్లాన్ వేస్తే తిరుగుండదంటారు. అది ఎన్నో సందర్భాల్లో రుజువైంది కూడా. తాజాగా మరోసారి ఆయన వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందట. ఆ జిల్లాలో ముఖ్య నేతగా ఉన్న ఆయనను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీలో అప్పుడు కలవరం మొదలైపోయిందని వినికిడి. ఈ పరిణామంతో కంచుకోటల్లో ఒకటైన ఆ జిల్లాలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైందని టాక్ వినిపిస్తోంది. నెల్లూరు జిల్లా టీడీపీలో కీలక నేతగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఆ జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ.. మరింత ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఆనంతో ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు అక్కడి ముఖ్య నేతలపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు అదిరిపోయే ప్లాన్‌ను సిద్ధం చేశారు. దీంతో గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచిన బలమైన నేత బొల్లినేని కృష్ణయ్యను టీడీపీలోకి ఆహ్వానించారు. ఇన్ని రోజులు చంద్రబాబు ఆహ్వానాన్ని పక్కన పెట్టిన ఆయన తాజాగా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారట.

2014 ఎన్నికల్లో బొల్లినేని కృష్ణయ్యను పార్టీలోకి ఆకర్షించడానికి చంద్రబాబు ఎంతో ప్రయత్నించారని ప్రచారం జరిగింది. అయితే మేకపాటి కుటుంబంతో ఉన్న స్నేహ సంబంధాల కారణంగా బొల్లినేని టీడీపీలో చేరడానికి నిరాకరించారని తెలిసింది. ఆ ఎన్నికల్లో మేకపాటి కుటుంబం గెలవడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆనం రామనారాయణరెడ్డి పార్టీ వీడిన తరువాత ఆత్మకూరులో గెలుపు కోసం టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించడం కోసం అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యతో చంద్రబాబు మంతనాలు జరిపారని ఆయన టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. అలాగే ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా బొల్లినేని కృష్ణయ్య పేరు దాదాపుగా ఖరారైనట్టేనని ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగానే అనుకుంటున్నాయని వినికిడి. ఈ ఊహించని పరిణామంతో వైసీపీలో కలవరం మొదలైందట. గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలిపిన బొల్లినేని టీడీపీలో చేరితే ఆ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందని పలువురు అనుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.