బీజేపీ వ్యతిరేక పార్టీలతోనే మీటింగ్‌లు ఎందుకు..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు రాష్ట్ర రాజకీయాలను చూసుకుంటూనే.. మరోవైపు తెలంగాణ ఎన్నికలపైనా దృష్టి సారించారు. ఇదే సమయంలో జాతీయ రాజకీయాల వైపు ఫోకస్ పెట్టారు. విభజన హామీల అమలు విషయంలో ఏపీకి మోసం చేసిందనే కారణంతో టీడీపీ.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి బీజేపీకి వ్యతిరేకంగా ఆ పార్టీ పోరాటం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీనే కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందనే ఉద్దేశంతో చంద్రబాబు.. బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాలను కలిసిన ఆయన.. తాజాగా కర్నాటక సీఎం కుమారస్వామితోనూ, మాజీ ప్రధాని దేవెగౌడతోనూ సమావేశమయ్యారు. అలాగే శుక్రవారం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో కూడా మంతనాలు జరపనున్నారు. అయితే, ఇప్పటి వరకు భేటీ అయిన, కాబోతున్న పార్టీలు బీజేపీకి వ్యతిరేకమైనవే కావడంతో కొత్త వాదన ఒకటి వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని తెలుగుదేశం వ్యతిరేక పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలు చంద్రబాబు భేటీలపై విమర్శలు చేస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు కలిసింది బీజేపీ వ్యతిరేక పార్టీలతోనేనని, దీని వల్ల ఆయన సాధించిందేమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కలిసే ప్రభుత్వాని ఏర్పాటు చేశాయి. అలాగే డీఎంకే కూడా కాంగ్రెస్‌తో కలిసే పని చేస్తోంది. వీటితో పాటు బీజేపీ బద్ధ వ్యతిరేకులైన శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాలను కలసి కూటమిలోకి ఆహ్వానించాల్సిన అవసరమేంటనే వాదన వినిపిస్తోంది. అయితే, చంద్రబాబు ఇలా చేయడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని తెలుస్తోంది. ముందుగా బీజేపీ వ్యతిరేకులను ఏకతాటిపైకి తీసుకొచ్చి.. కూటమి అనేది ఏర్పాటు చేస్తే.. తర్వాత కూటమికి పరోక్షంగా మద్దతిస్తున్న, తటస్థంగా ఉన్న పార్టీలను కూడా మద్దతు అడగొచ్చనే ఆలోచనతోనే చంద్రబాబు ఈ విధంగా చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా పార్టీల వివరాలను కూడా చంద్రబాబు.. తాను భేటీ అవుతున్న నేతలకు వివరిస్తున్నారని టాక్. ఏదిఏమైనా చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహంతో భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పేలా లేవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.