ముందస్తు కోసం వాళ్లను పంపుతున్న చంద్రబాబు

తెలంగాణలో జరగనున్న ముందస్తు ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకోసమే ఎన్నో ప్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో చిత్ర విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారో.. ఏ పార్టీలో చేరుతారో అర్థమయ్యే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఏర్పాటు చేసిన ప్రజాకూటమి క్రమంగా బలపడుతోంది. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన ఈ కూటమిలో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత అండగా నిలుస్తున్నారు. అంతేకాదు, తెలంగాణలో ప్రజాకూటమి అభ్యర్థుల కోసం ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంతో కూటమిలో జోష్‌ పెరుగుతోంది. రెండు రోజులుగా రాష్ట్రంలో ఆయన నిర్వహిస్తున్న సభలు, రోడ్‌ షోలకు అనూహ్య స్పందన వచ్చింది. దీంతో టీడీపీ అభ్యర్థులతో పాటు, కూటమిలోని మిగిలిన పార్టీల అభ్యర్థులు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే తెలంగాణలో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థుల కోసం ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఆయన.. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కూడా పంపనున్నారు. ఇప్పటికే బాలయ్య షెడ్యూల్ కూడా ఖరారైంది. ఇక తాజాగా, ఏపీకి చెందిన ముఖ్య నేతలను తెలంగాణలో ప్రచారానికి పంపాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇటీవల నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న కూకట్‌పల్లి ఏపీ మంత్రి పరిటాల సునీత ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇకపై మరికొంత మంది మంత్రులు, ముఖ్య నేతలు టీడీపీ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించబోతున్నారట. గ్రేటర్ హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న సీమాంధ్రులను తమ వైపునకు తిప్పుకోడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఏపీ మంత్రుల్లో సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, గంటా శ్రీనివాసరావు, జవహర్ సహా పలువురు ముఖ్యులు తెలంగాణలో పర్యటించనున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు టీఆర్ఎస్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో పార్టీ జనసేన నేతలు కూడా ఇటీవల ఓ టీఆర్ఎస్ అభ్యర్థిని బలపరిచేందుకు ప్రయత్నాలు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.