హస్తినలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు

ఏపీకి ప్రత్యేక హోదా కోసం హస్తినకు వచ్చిన సిఎం చంద్రబాబు ముందుగా ఎంపీలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత జాతీయ నేతలతో మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వివిధ రాజకీయ పార్టీలకు వివరిస్తున్నారు. ఆ పార్టీ నేతల మద్దతు కూడగట్టే పని చేస్తున్నారు. తెలుగుతో పాటు… హిందీ, ఇంగ్లిష్‌లలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక పుస్తకం తయారు చేసింది. ఆ ప్రతులను చంద్రబాబు వారికి అందిస్తున్నారు. పార్లమెంటులోనే సెంట్రల్‌హాల్‌తో పాటు, అక్కడే ఉన్న పార్టీల కార్యాలయాలకు వెళ్లి వారితో మాట్లాడటం ఆసక్తిని రేపుతోంది. పార్టీ ఏదైనా.. తమకు సహకరిస్తే చాలు అంటున్నారు చంద్రబాబు. 
కాంగ్రెస్ పార్టీ నేతలతో మాట్లాడే విషయంపై తర్జన భర్జన జరిగినా చివరకు అందరితోను చర్చించేందుకే సిద్దమయ్యారు. అందుకే కాంగ్రెస్ నేతలతోను మాట్లాడుతున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలతో ఫోన్లో మాట్లాడారు. హోదా, ప్యాకేజి, విభజన హామీల నిధులతో పాటు.. బీజేపీ సర్కార్ తమకు ఎలా అన్యాయం చేసిందో వివరిస్తున్నారు. ఇది బీజేపీని కలవరానికి గురి చేస్తోంది. హోదా ఇస్తామని చెప్పిన అధికార పార్టీ కావాలని వెనక్కు తగ్గడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే ఏడు పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాన నోటీసులిచ్చాయి. అయినా దానిపై విచారణ చేపట్టలేదు స్పీకర్. కావాలనే ఈ పని చేయడం లేదని తెలుస్తోంది. చంద్రబాబు హస్తిన టూర్ పై బీజేపీ ఆసక్తి చూపిస్తోంది. ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు.. ఎలాంటి హామీలు ఇచ్చారు ఏంటనే విషయంపై సమాచారం సేకరిస్తోంది. చంద్రబాబు చెప్పే మాటలకు వీలున్నంత తొందరగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది కమలం పార్టీ.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.