వాళ్లు వస్తానంటే ఓకే అంటున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. నలభై ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ నేత. రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఒడ్డుకు తీసుకురాగల నాయకుడని నమ్మిన అక్కడి ఓటర్లు చంద్రబాబుకు జై కొట్టారు. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నవ్యాంధ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, రాజధాని నిర్మాణం తదితర అంశాల గురించి విదేశీ పర్యటనలు చేస్తూ ఎన్నో కంపెనీలను ఏపీకి తీసుకువచ్చారు. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి ఆయన అనుభవమే పనికొచ్చింది. ఆయనే కాకుండా పార్టీలోని చాలా మంది నేతలు, అధికారులతో రాష్ట్రం కోసం పని చేపిస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఆయన గొప్ప రాజకీయ చాణక్యుడు. రాజకీయాలు చేయడంలో దిట్ట. అలాంటి నేతకు త్వరలో జరగబోయే ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. గత ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన తెలుగుదేశం పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి చంద్రబాబు ఎంతగానో పని చేస్తున్నారు. అభివృద్ధే ప్రధాన ఆయుధం ఎన్నికల బరిలో దిగాలని చూస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున చంద్రబాబులోని చాణక్యుడు బయటికి వస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీలోని 22 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. వాళ్లనే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా వ్యవహరించిన నేతలను కూడా పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో టీడీపీలో హౌస్‌పుల్ అయిపోయింది. ఇప్పుడు నాయకులు ఎవరైనా ఆ పార్టీలోకి వస్తామంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో వైసీపీలోని కొందరు నేతలు సైకిల్ ఎక్కేందుకు సై అంటున్నారని సమాచారం. ఇటీవల కాపు రిజర్వేషన్ల గురించి ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన వైసీపీలో కలకలం రేపింది. అందులోని కొందరు నేతలతో పాటు, కాపు నేతలందరూ అధినేత ఇచ్చిన షాక్‌తో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారట. జగన్ ప్రకటన వల్ల భవిష్యత్‌లో వచ్చే పరిణామాల వల్ల తమ మనుగడ దెబ్బతినే అవకాశం ఉందని తలంచిన ఆ నేతలు టీడీపీలోకి రావాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఈమేరకు ప్రస్తుత కేబినెట్‌లో ఉన్న ఓ మంత్రితో రాయభారం నడిపారని, దీనికి సీఎం ‘‘కాపు నేతలైతే ఓకే’’ అన్నారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొందరు కాపు నేతలు త్వరలో సైకిల్ ఎక్కబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.