‘ఆమంచి’ని మంచి చేసుకుంటున్న బాబు…  ఎందుకంటే?

ప్రస్తుతం ఏపీలోని రాజకీయ పరిస్థితులు టిడిపి అధినేత చంద్రబాబును గందరగోళంలోకి నెట్టేసేలా ఉన్నాయనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్న కాపు, బీసీ ఓట్లు దూరమైపోతాయన్న ఆందోళన చంద్రబాబులో వ్యక్తమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన కాపు, బీసీ వర్గాలకు దగ్గరయ్యేలా ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే ఆయన ప్రకాశం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. కాగా ప్రకాశం జిల్లా అనగానే ముందుగా గుర్తుకు వచ్చే రాజకీయ నేత పేరు ఆమంచి కృష్ణమోహన్. రాజకీయాలతో పాటు ప్రజలకు మంచి చేయడంలో ఆమంచి కృష్ణమోహన్ స్థానికంగా మంచిపేరు సంపాదించారని వినికిడి. ఈ కారణంగానే 2001 నుంచి ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నేతగా ఆమంచి కృష్ణమోహన్ ప్రకాశం జిల్లాలో గుర్తింపుపొందారు. ఇంతటి చరిష్మా కలిగిన నాయకుడిని దగ్గర చేసుకుంటే కాపులు, బిసి వర్గాలు తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతాయని చంద్రబాబు భావిస్తున్నారట!
2014 ఎన్నికలలో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా ‘ఆమంచి’ పోటీ చేశారు. ఈ నేపద్యంలో టిడిపి-వైసిపి నాయకులకు చుక్కలు చూపించారని స్థానికులు అంటుంటారు. ఆయన విజయం సాధించాక రాష్ట్ర అభివృద్ధి కోరుతూ తెలుగుదేశం పార్టీలో చేరారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కాపుల నుంచి కాస్త వ్యతిరేకత పొడచూపుతున్నదన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమంచి కృష్ణమోహన్ అటువంటి వాతావరణాన్ని తన నాయకత్వంతో చక్కదిద్దుతారని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే ప్రకాశం జిల్లాలో టీడీపీకి వ్యతిరేకత రాకుండా కాపాడే బాధ్యత చంద్రబాబు… ఆమంచికి అప్పగించాలనుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తనపై కాపులలో ఉన్న అపోహలు తొలగించుకోవడానికి చంద్రబాబు ఆ వర్గం నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో తలమునకలవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు ప్రయత్నాలకు ఆమంచి ఎంతవరకూ సహకరిస్తారో, ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలవంతమవుతాయో వేచిచూడాల్సిందే!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.