ఆ ఇద్దరినే చంద్రబాబు ఎందుకు సెలెక్ట్ చేశారంటే..

అవిశ్వాస తీర్మానంపై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన వేళ.. ఇద్దరు ఎంపీలు తమ వాఖ్చాతుర్యంతో ఆకట్టుకున్నారు. ఎంతో మంది ఎంపీలు.. తలపండిన రాజకీయ నేతలు.. చాలా మంది ఉద్దండులు ఉన్నా.. ఒక్క స్పీచ్‌తో దేశం మొత్తాన్ని తమ వైపు తిప్పుకున్నారు. ఒకరు ఇంగ్లీష్‌లో ‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’’ అని సంబోధిస్తూ అనర్గళంగా మాట్లాడగా, మరొకరు హిందీ ‘‘తమషా చేస్తున్నారా’’ అంటూ ప్రశ్నిస్తూ దడ పుట్టించారు. ఎంపీలుగా మొదటిసారి ఎన్నికైనప్పటికీ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చాలా చక్కగా వివరించి, అవిశ్వాసం పెట్టిన ఫలితం చూపించారు. ఇప్పటికే వాళ్లిద్దరూ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. వాళ్లే ఏపీ ప్రజల చేత శభాష్ అనిపించుకుంటున్న టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కింజారపు రామ్మోహన్ నాయుడు.

శుక్రవారం పార్లమెంట్‌లో అవిశ్వాసంపై జరిగిన చర్చలో ఈ ఇద్దరు ఎంపీలు సత్తా చాటారు. తమ రాష్ట్ర ప్రజల బాధలు చెప్పుకోడానికి సరైన వేదిక దొరికిన సమయంలో.. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర ఎదుర్కొంటున్న కష్టాలు, తలకెత్తుకున్న నష్టాలను లోక్‌సభ వేదికగా ఎలుగెత్తి చాటారు. నవ్యాంధ్రకు జరిగిన అన్యాయాన్ని… ఈ అన్యాయాన్ని మోదీ సర్కారు సరిదిద్దని వైనాన్ని దేశం దృష్టికి తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన అవిశ్వాస తీర్మానంపై టీడీపీ ఎంపీలు చేసిన ప్రసంగానికి చాలా మంది ఫిదా అయిపోయారు. అసలు ఈ ఎంపీలిద్దరూ పార్లమెంట్‌లో మాట్లాడడం వెనుక చంద్రబాబు వ్యూహం ఉందట. టీడీపీ తరపున 15 మంది ఎంపీలున్నా ఈ ఇద్దరు ఎంపీలను ఆయన వ్యూహాత్మకంగా ఈ చర్చకు ఎంపిక చేశారట.

ఈ ఇద్దరిలో అమెరికాలో చదువుకుని వచ్చిన జయదేవ్‌ ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలరు. రామ్మోహన్‌ గతంలో కొంతకాలం ఢిల్లీలో ఉద్యోగం చేసి హిందీ భాషపై పట్టు సాధించారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర అంశాలను ప్రముఖంగా చాటి చెప్పడానికి ఈ ఇద్దరూ సరిపోతారన్న అంచనాతో చంద్రబాబు వారిని ఎంపిక చేశారట. గతంలో పార్లమెంటులో వివిధ సందర్భాల్లో ప్రసంగించడం ద్వారా వారు అప్పటికే కొంత గుర్తింపు సంపాదించారు. అవిశ్వాసం నోటీసు ఇచ్చిన ఎంపీగా కేశినేని నాని ప్రసంగించాల్సి ఉంది. కానీ, ఆయనకు కొంత భాషాపరమైన సమస్య ఉండడంతో ఆయన స్థానంలో జయదేవ్‌ను ఎంపిక చేసి ఆయనతో చర్చ ప్రారంభింపజేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. జయదేవ్ ప్రసంగించిన తర్వాత పార్లమెంట్ బ్రేక్ సమయంలో రామ్మోహన్‌నాయుడుతో మాట్లాడిన తర్వాత చంద్రబాబు ఎలా మాట్లాడాలో వివరించారని, అందుకు తగ్గట్టుగానే యువ ఎంపీ మాట్లాడి మార్కులు కొట్టేశారని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.