ఎలా ఉండాలో… ఎలా ఉండకూడదో చెబుతున్న బాబు

ఎన్నికల నేపధ్యంలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలకు పలు సూచనలు, సలహాలు అందిస్తూ అప్రమత్తమవుతున్నారని సమాచారం. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల పని తీరును అంచనా వేసి ఓ రిపోర్టు తయారు చేయించిన చంద్రబాబు వాటిని ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు అందించారని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వారి పని తీరు, పద్దతులు మార్చుకోవాలని చెప్పేందుకు చంద్రబాబు ఇలా చేశారని తెలుస్తోంది. పనిలోపనిగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు జనంలోకి తీసుకెళ్లిన వారికి మాత్రమే టికెట్లు ఇస్తానని బాబు చెప్పారట. బాబు అందించిన రిపోర్టులలో ఆయా ఎమ్మెల్యేల పని తీరు, వైఫల్యాలకు సంబంధించిన సమాచారం పొందుపరిచారని తెలుస్తోంది. ఈ రిపోర్టును  చూసిన కొంత మంది ఎమ్మెల్యేలు బాబు వద్దకు వెళ్లి తమ పని తీరు  మార్చుకుంటామని చెప్పారని తెలుస్తోంది. ఇదిలావుండగా వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి యాత్రల పేరుతో  ఏపిని చుట్టేస్తున్న విషయం విదితమే. పైగా ఆయన సభలకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. జగన్ నుండి గట్టిపోటీ ఎదురు కాబోతున్నదని భావించిన బాబు సర్వేలు చేయించారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
అందుకే ఆయన ప్రజాప్రతినిధుల పని తీరు మెరుగుపరచుకోవాలని సూచిస్తున్నారట. కొద్ది నెలల్లో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అందరినీ  సమాయత్తం చేస్తున్నారు. జగన్‌కు అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే తాము గట్టి ప్రయత్నాలు చేయాలని వారికి ఉద్బోద చేస్తున్నారట. గత ఎన్నికలంత ఈజీగా ఈ సారి ఉండదని బాబు అంచనాకు వచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలావుండగా ఇటీవలకొంత మంది టీడీపీ నేతలు నోరుజారి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశారనే విమర్శలు వెల్లువెత్తాయి. హోదా విషయంలో, కేంద్ర ప్రభుత్వం జరుగుతున్న  విమర్శలు, ప్రతి విమర్శల విషయంలో ముఖ్యంగా ఎంపీలు కొందరు చేసిన కామెంట్లు బాబును బాగా ఇరకాటంలో పెట్టాయని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ప్రజలతో సంబంధాలను మెరుగు పర్చుకోవాలని బాబు వారికి హిత బోధ చేస్తున్నారని సమాచారం. కోస్తా ప్రాంతానికి చెందిన కొద్ది మంది నాయకులు, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒకరిద్దరు నాయకుల వ్యహార శైలితో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో చంద్రబాబు ఎమ్మెల్యేలతో ప్రజలతో ఎలా మెలగాలనే విషయంపై క్లాసులు తీసుకుంటున్నారని తెలుస్తోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.