ఎన్టీఆర్ నామ జపం చేస్తున్న చంద్రబాబు

అన్న ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. తెలుగుజాతికి, కళా రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ఇవ్వాలని ఎప్పటి నుంచో అభిమానులు కోరుతున్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న యుపిఏ ప్రభుత్వం ఎలాగు పట్టించుకోలేదు. కానీ నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి ఉన్న టీడీపీ కేంద్రంపై ఒత్తిడి తేలేదు. ఎన్టీఆర్ భారతరత్న అవార్డు ఇవ్వాలని ఎక్కడా ఆందోళనలు చేసిన దాఖలాలు లేవు. నిరసన కార్యక్రమాలు లేవు. కానీ ప్రతి మహానాడు రోజు ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరడం మినహా ఏం చేయడం లేదు. ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇస్తే ఆయన సతీమణిగా లక్ష్మీ పార్వతి అవార్డు తీసుకోవాల్సి ఉంటోంది. అలా అవార్డును ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తప్ప మరొకరు తీసుకోవడం సిఎం చంద్రబాబుకు ఇష్టం లేదంటున్నారు. అందుకే భారతరత్న విషయంలో పెద్దగా డిమాండ్ చేయలేదనే విమర్శలున్నాయి. 
ఇప్పుడు పసుపు పండగ మహానాడు వైభవంగా సాగుతోంది. బెజవాడలో జరుగుతున్న మహానాడు వేదికగా…అన్న ఎన్టీఆర్ ప్రస్తావన చేశారు చంద్రబాబు. తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని కీర్తించారు. అంతే కాదు… ఎన్టీఆర్ కు ‘భారతరత్న’ ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన సేవలను కొనియాడారు పలువురు ప్రముఖులు. ఆయన ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. 
తెలుగు రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపిన ఎన్టీఆర్‌కు అవార్డు వస్తేనే అసలైన నివాళి అన్నారు చంద్రబాబు. అంతే కాదు…అమరావతి రాజధానిలో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పనిలో పనిగా తేజ తప్పుకోవడంతో ఎన్టీఆర్ బయోపిక్ ఆగుతుందనే ప్రచారానికి తెరదించారు చంద్రబాబు. తెలుగువాళ్లందరూ స్ఫూర్తి పొందేలా ఎన్టీఆర్‌ బయోపిక్ ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నాటికే బయోపిక్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.  
తగ్గని మోత్కుపల్లి…
టీడీపీని నందమూరి వారసులకు అప్పగించాలని ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళులర్పించారు. ఆయనే కాదు…హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వరరావు, నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. మరోవైపు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని వైకాపా అధినేత జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. దీని పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభా ముఖంగా ప్రకటన చేస్తారని ఆశించారు. కానీ ఆపని చేయలేదు.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.