అలా మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్న చంద్ర‌బాబు?

ఏపీలో వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌, వామపక్షాలు త‌మ పర్యటనలను మ‌రింత వేగవంతం చేసి టిడిపిని టార్గెట్‌ చేసుకొని ఎన్నికల బరిలో దిగిన‌ విష‌యం విదిత‌మే. ఈనేపధ్యంలో సీఎం బాబు కులాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృధ్ధి పధకాలపై ప్రచారం చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు భోగట్టా. ఈ నేప‌ధ్యంలోనే దళిత తేజం పేరిట నెల్లూరులో మైనార్టీలకు దగ్గర కావడానికి నారా హమారా… టిడిపి హమారా పేరిట భారీ బహిరంగం సభ నిర్వహించిన విష‌యం విదిత‌మే. అలాగే వచ్చే నెలలో రాజమండ్రిలో బిసీ మహాగర్జన సభకు సన్నాహాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది. దీనికితోడు జ్ఞానభేరి పేరిట యువతను ఆకర్షించడానికి విశ్వవిద్యాలయాల వారీగా సభలు నిర్వహించి విద్యాభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి, నైపుణ్యం, నిరుద్యోగ భృతిపై ప్రచారం నిర్వ‌హించాల‌ని టీడీపీ  ఉబ‌లాట ప‌డుతున్న‌ద‌ని తెలుస్తోంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ జన్మభూమి- మావూరు, నీరు-ప్రగతి,నీరు-మీరు, మీఇంటికి మీభూమి, ఇంటింటికీ తెలుగుదేశం పేరిట తెలుగు తమ్ముళ్లకు కార్యక్రమాలను అప్ప‌జెబుతున్న విష‌యం విదిత‌మే. దీనికి తోడు విభజన చట్టం హామీలను కేంద్రం అమలు చేయకుండా, ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వక పోవడంపై బాబు కేంద్రంపై తిరుగుబావుటా ఎగరవేశారు. ఈ నేప‌ధ్యంలో జాతీయ స్థాయిలో విపక్షాల మద్దతు కూడకట్టి కేంద్రంపై చేస్తున్న ధర్మపోరాటం ఉద్యమంలో బాబు సఫలీకృతులైయ్యార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఫ‌లితంగా ఇప్పుడు కేంద్రం ఒకమెట్టు దిగినా, రాష్ట్రంలో బిజేపిపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నార‌ని స‌మాచారం. దీంతో కేంద్రం బాబును ఇరకాటంలో పెట్టడానికి  రాష్ట్ర బిజేపి నేతలను ఉసిగొల్పడం జ‌రుగుతున్న‌ద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌ధ్యంలోనే బిజేపి జాతీయ నేతలు మురళీధర్‌,రాంమాధవ్‌,రాజ్యసభ సభ్యుడు జివిఎల్‌ నరసింహరావులను రాష్ట్రానికిపంపి రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలను చేయిస్తున్న‌ద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వీటిని తిప్పికొట్టేందుకు బాబు ప్రజల్లోనికి వెళ్ళి అన్ని వర్గాల మద్దతు కూడ‌గ‌ట్టడంతోపాటు గ్రామదర్శిని, గ్రామవికాస్‌, నగరదర్శిని, నగరవికాస్‌ పేరిట ఊరు-వాడ అదికారులతో పాటు టిడిపి శ్రేణులను పంపి ప్రభుత్వం నాలుగేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ పధకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నార‌ని భోగ‌ట్టా. మరో పక్క ధర్మపోరాటం పేరిట బాబుపెద్దఎత్తున సభలు నిర్వహించిన కేంద్రంపై ప్రతిదాడికి దిగిన‌ విష‌యం విదిత‌మే. వీటికి ప్రజలనుంచి టిడిపికి ఆశించిన మద్దతులభిస్తోంద‌ని తెలుస్తోంది. ప్ర‌తిప‌క్షాల దాడుల‌ను వ్యూహాత్మ‌కంగా తిప్పికొడుతున్న చంద్ర‌బాబాబు ఎంతవ‌ర‌కూ స‌క్సెస్ కాగ‌ల‌రో కాల‌మే చెప్పాలి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.