బీజేపీ తేరుకోక ముందే.. బాబు యాక్షన్ ప్లాన్ రెడీ

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున జాతీయ పార్టీలతో పాటు, ప్రాంతీయ పార్టీలు వేగం పెంచాయి. బిజెపికి వ్యతిరేకంగా ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పోరాటం చేసేది. ఇప్పుడు ఆ పార్టీకి తెలుగుదేశం కూడా తోడవడంతో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజెపియేతర కూటమిని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు. దీనికోసమే తన చిరకాల ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీతో సైతం జత కట్టేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన చంద్రబాబు.. దేశాన్ని కాపాడేందుకే తాము కలుస్తున్నట్లు వెల్లడించారు. బిజెపి ఏపీకి, దేశానికి ప్రమాదకరంగా మారిందని చెప్పారు. ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే కాకుండా తమతో నడిచే పార్టీలన్నీటితో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమని కూడా ప్రకటించారు. దీనికోసం అన్ని పార్టీల నేతలతో మంతనాలు జరుపుతామని తెలిపారు.

ఇందులో భాగంగానే చంద్రబాబు మరో రెండు ప్రాంతీయ పార్టీల అధినేతలను కలవాలని నిర్ణయించారు. దీని కోసం గురువారం ఆయన దక్షిణ దేశ యాత్రకు సిద్ధమవుతున్నారు. కర్ణాటక, తమిళనాడుల్లో ఒకేరోజు ఆయన పర్యటించనున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు ఆయన ముందు బెంగళూరు చేరుకొంటారు. అక్కడ సీఎం కుమారస్వామి, జేడీఎస్‌ అధినేత దేవెగౌడలను కలిసి మాట్లాడతారు. కర్ణాటక కాంగ్రెస్‌ నేత శివ కుమార్‌ తదితరులు కూడా అక్కడ ఆయనను కలుస్తారు. అక్కడ నుంచి మధ్యాహ్నం చెన్నై వెళతారు. అక్కడ స్టాలిన్‌తో సమావేశం అవుతారు. మంగళవారం వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో బిజెపికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మూడు లోక్ సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్- జెడిఎస్ కూటమి నాలుగు స్థానాలు దక్కించుకోగా, బీజేపీ కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఫలితాలను ఉపయోగించుకోవాలని ఉద్దేశంతోనే చంద్రబాబు పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారం సమయంలోనే ఈ కూటమికి అడుగులు పడిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా చంద్రబాబు ప్రయత్నాలతో బిజెపికి కష్టాలు మొదలయ్యాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.