చంద్రబాబు ప్లాన్‌తో వైసీపీకి మైండ్ బ్లాక్

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. పార్టీలు చేస్తున్న హడావిడికి తోడు నాయకులు చేస్తున్న ఫీట్లు ఆకట్టుకుంటున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ దూసుకుపోతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్న రాజకీయం సంచలనం అవుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవాలనుకుంటున్న జగన్.. ఎన్నో ప్రణాళికలు రచిస్తున్నాడు. అయితే, అవి ఆ పార్టీకి ప్లస్ అవ్వకపోగా మైనస్ అవుతున్నాయి. టీడీపీని ఇరుకున పెట్టేందుకు జగన్ ఎన్నో ప్లాన్లు చేస్తుండగా, అంతే స్థాయిలో చంద్రబాబు కూడా ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. టీడీపీ అధినేత ఎదురుదాడికి దిగుతుండడంతో ప్రతిపక్ష పార్టీకి ఛాన్స్ దొరకడంలేదు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కీలక నేతలు తమ భవిష్యత్ కోసం మార్గాలను అన్వేషించుకుంటున్నారు. ఇందులో భాగంగానే టీడీపీకి చెందిన ఓ నేత వైసీపీ కండువా కప్పుకోనుండగా, ఓ మాజీ మంత్రి సైకిల్ ఎక్కబోతున్నారు. తాజాగా ఏపీలో జరుగుతున్న ఈ పరిణామాలు పొలిటికల్ హీట్ పెంచేస్తున్నాయి. ఈ పరిణామాల వెనుక ఓ సంచలన విషయం ఉందని ప్రచారం జరుగుతోంది.

నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేత ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన ఆయన సెప్టెంబర్ 2వ తేదీన జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఆ రోజు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని, వైసీపీలో చేరబోతున్నట్లు ఆనం ప్రకటించారు. దీంతో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైందని వైసీపీ శ్రేణులు భావించాయి. అయితే, చంద్రబాబు వేసిన ప్లాన్‌తో ఆ పార్టీ నేతలకు మైండ్ బ్లాక్ అయిపోయిందట. కిరణ్‌కుమార్ కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన ఉత్తరాంధ్ర నేత కొండ్రు మురళీమోహన్ టీడీపీలో చేరాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అయితే, సీఎం అనుమతి కోసం వేచి చూశారు కొండ్రు. ఆనం వైసీపీలో చేరే తేదీని పత్రికలు ప్రచురించడంతో ముంబైలో ఉన్న చంద్రబాబు రాష్ట్ర నాయకులకు ఫోన్ చేసి ‘సెప్టెంబర్ 2 కంటే ముందే కొండ్రు పార్టీలోకి వచ్చేయాలని చెప్పండి’ అని అన్నారట. సీఎం మాటను ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు, కొండ్రుకు చెప్పడంతో ఆయన ఈనెల 31న టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఆనం వెళ్లినా, టికెట్ కన్ఫార్మ్ కాకపోవడంతో అక్కడ పార్టీకి జరిగే నష్టమేమీ లేదని, కొండ్రు రాకతో రాజాం నియోజకవర్గంలో మాత్రం వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.