చంద్రబాబు బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్

బయోపిక్‌ మూవీలంటే ఒకప్పుడు హిందీ బాషకే పరిమితమన్నట్లు చెప్పుకునేవారు. దిగ్గజాల చరిత్రలను ప్రజెంట్ చేయడంలో పొరపాట్లు జరిగితే అసలుకే ఎసరొస్తుందని భావించి, మిగతా భాషల్లో ఈ తరహా ప్రయత్నాలు చేసేవారు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. దిగ్గజ నటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’కి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు తెలుగులో ఏకంగా పలు బయోపిక్ మూవీలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. వాటిలో దివంగత నేతలు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు నందమూరి తారకరామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రల ఆధారంగా వస్తున్న బయోపిక్‌లు రిలీజ్‌కు ముందే మంచి బజ్‌ను సంపాదించాయి. రామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్’ పేరిట తెరకెక్కుతుండగా, వైఎస్ బయోపిక్ ‘యాత్ర’ పేరిట వస్తోంది. ఈ రెండు సినిమాలు ప్రకటించినప్పటి నుంచే ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అందులోనూ ఎన్నికలు జరగబోతున్న సంవత్సరం కావడంతో వీటిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు తెలుగులో వీటికి తోడు ఓ ముఖ్యనేత బయోపిక్ తెరకెక్కుతున్న విషయం చాలా మందికి తెలియదు. అదే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్ మూవీ ‘చంద్రోదయం’.

40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇటు రాష్ట్ర రాజకీయాలతో పాటు, అటు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ దూసుకుపోతున్న లివింగ్ లెజెండ్ నారా చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమే ‘చంద్రోదయం’. శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్‌పై పీ వెంకటరమణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను జీజే రాజేంద్ర నిర్మిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేటికి 23 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటికే 80 శాతం పూర్తయిన ఈ సినిమాలో వినోద్ నువ్వుల చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తుండగా, భాస్కర్ ఎన్టీఆర్‌గా కనిపించనున్నారు ఓ సామన్య కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో అగ్ర స్థానానికి ఎదిగిన చంద్రబాబు జీవితం గురించి అందరికీ తెలియచెప్పాలనే సంకల్పంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. చంద్రబాబు నాయుడు చిన్నతనం నుంచి ఆయన రాజకీయ నాయకుడిగా ఎదిగిన క్రమాన్ని ఈ బయోపిక్‌లో చూపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి చేసి అక్టోబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.