హోదా ఇచ్చేది లేదన్న కేంద్రం

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. పార్టీలకతీతంగా అంతా హోదా ఇవ్వాలని కోరుతున్నారు. ప్రజల డిమాండ్ అదే. కానీ హోదా ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది కేంద్రం. మొన్న అరుణ్ జైట్లీతో జరిగిన సమావేశం ఆశాజనకంగా లేదు. యనమల రామకృష్ణుడు నేతృత్వంలో భేటీ జరిగినా సరిగా లేదని తెలుస్తోంది. హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం మరోసారి చెప్పింది. గతంలో కాంగ్రెస్ ఇలానే చెప్పింది. ఎవరు ఎన్ని ఆందోళనలు చేసినా ఏపీ విభజన చేస్తామని చెప్పింది. చేసింది. ఇప్పుడు బీజేపీ అదే తీరులో వ్యవహరిస్తోంది. అందుకే వీలున్నంత తొందరగా బీజేపీ నుంచి బయటకు రావాలని ఆలోచిస్తోంది టీడీపీ. నిన్న అసెంబ్లీలోను చంద్రబాబు గట్టి సంకేతాలే ఇచ్చారు. మిత్ర పక్షం అని కాస్త పద్దతిగా వెళుతున్నాం. లేకపోతే అంతు తేల్చేవాళ్లమనే తీరులో మాట్లాడారు. 
జీఎస్టీ అమలైన తర్వాత హోదా కలిగిన రాష్ట్రాలకూ పన్ను మినహాయింపులు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు కేంద్రం చెబుతోంది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఫలితంగా కేంద్రం ఏపీకి న్యాయం చేసే విషయంలో మొండిగా వ్యవహరిస్తుందని అర్థమవుతోంది. పార్లమెంటు వేదికగా వివిధ పార్టీలు నిరసనలు చేస్తున్నారు. అయినా సరే కేంద్రం లెక్క చేయడంలేదు. వారే ఆందోళన చేస్తారు. మానుకుంటారు అనే తీరులోనే వ్యవహరిస్తోంది. 
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ రామ్మోహన నాయుడు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావులతో జరిగిన సమావేశంలోను ఏపీ డిమాండ్లపై కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ సరిగా స్పందించలేదు. ఈశాన్య రాష్ట్రాల తరహాలో రాయితీలను ఇచ్చే అవకాశాలు లేవని కేంద్రం చెప్పేసింది. ప్యాకేజీకి మాత్రమే తాము పరిమితమవుతామని, రెవెన్యూ లోటును మరో 1600 కోట్లకు మించి అదనంగా ఇవ్వడం సాధ్యం కాదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తామన్నాం. విదేశీ సహాయ ప్రాజెక్టులకు నిధులు ఎక్కడి నుంచి కావాలో వారినే తేల్చుకోమన్నాం. అంతకంటే ఏమీ చేయలేం’’ అని జైట్లీ చెప్పారంటున్నారు. 
ఆందోళన చేస్తామంటే రండి మాట్లాడుకుందాం రమ్మంటారు. తీరా వచ్చాక చెప్పేది ఏం లేదని తేల్చేస్తున్నారు. 
అందుకే అసలు బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే మంచిదని చెబుతున్నారు టీడీపీ ఎంపీలు.ఇదే విషయాన్ని సిఎం చంద్రబాబుకు చెప్పారంటున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చినట్లు రాయితీలను ఏపీకి ఇస్తే ఒడిసా, బెంగాల్‌, ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌ వంటి రాష్ట్రాలు కూడా అడుగుతాయి. తాము ఇబ్బంది పడాల్సి వస్తుందనేది కేంద్రం ఆలోచన. 
పవన్ కల్యాణ్ లాంటి వారు మాటలకే పరిమితం కావడం, అది చేస్తాను. ఇది చేస్తాను అని చెప్పడం తప్ప ఏం చేయలేకపోయారు. వైకాపా నామ మాత్రంగానే ఆందోళనలు, నిరసనలు చేస్తోంది. కాంగ్రెస్ లో కాస్తంత కదలిక వచ్చింది. రాహుల్ గాంధీ లాంటి వారు వచ్చి మరీ ఏపీకి న్యాయం చేయాలని అడగడం ఆహ్వానించ దగ్గ పరిణామమే. గతంలో ఏపీకి అన్యాయం చేసినా.. తిరిగి తాము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని చెప్పడం మంచిదే.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.