బీజేపీ కొత్త స్కెచ్ !

రాబోయే ఎన్నిక‌ల‌పై ఇప్ప‌టినుంచే క‌స‌ర‌త్తు చేస్తున్న బీజేపీ ఈ క్ర‌మంలో త‌న‌తో క‌లిసి వ‌చ్చే వారితో వ‌రుస‌గా స‌మావేశాలు జ‌రుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇలా జ‌రుపుతున్న స‌మావేశాల్లో కొంద‌రు క‌మ‌ళ‌నాథుల ప‌ట్ల ఆక‌ర్షితులు అవుతున్నారు. ఇంకొంద‌రు బ‌య‌ట‌ప‌డ‌టం లేదు. అయితే, తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ పేరు ఈ జాబితాలో బ‌య‌ట‌కు వ‌చ్చింది. 51 ఏళ్ల మాధురి దీక్షిత్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు సమాచారం. 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో పూణె లోక్‌సభ స్థానం నుంచి ఆమెను బరిలోకి దించేందుకు బీజేపీ సిద్దమైందని స‌మాచారం. ఈమెతో పాటుగా వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ వంటి వాళ్లను రంగంలోకి దించడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ప్ర‌చారం జ‌రుగుతోంది. 
ఈ ఏడాది జూన్‌లో సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మాధురీ దీక్షిత్‌ను ఆమె నివాసంలో కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ చేపట్టిన కార్యక్రమాలు, మోదీ ప్రభుత్వ అభివృద్ధిని వివరించారు. మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత ఒకరు జాతీయ వార్తా ఏజెన్సీతో మాట్లాడుతూ.. పూణే లోక్‌సభ స్థానానికి చేసిన షార్ట్‌లిస్ట్‌లో మాధురీ దీక్షిత్ పేరు ఉన్నట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో ఆమెను పోటీలోకి దించే విషయంలో పార్టీ చాలా సీరియస్‌గా ఉందన్నారు. మాధురీ దీక్షిత్‌కు ఇదే మంచి అవకాశంగా తాము భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు
కొద్దికాలం క్రితం సెహ్వాగ్ సైతం .ట్విట్టర్లో ఓ క్రేజీ ఫొటోను పెట్టేసి బీజేపీలో చేరే సిగ్న‌ల్స్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కాషాయ దుస్తులేసుకుని, కమండలం పట్టుకుని, మెళ్ళో రుద్రాక్షలతో ప్రత్యక్షమై ‘నేనంటే నేనే’ అంటూ ట్వీటాడు సెహ్వాగ్‌. ఇక స‌హ‌జంగానే దానిపై చ‌ర్చ సాగింది.అస‌లెందుకు ఈ డాషింగ్ క్రికెట‌ర్ ఇలా చేశాడు?  రాబోయే ఎన్నిక‌ల్లో ఏమైనా బ‌రిలో దిగుతాడా? అంటూ విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి. దీంతో సెహ్వాగ్‌కు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో బంధం తెర‌మీద‌కు వ‌చ్చింది. బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే అరుణ్ జైట్లీకీ వీరూకీ మధ్య మంచి దోస్తీ ఉంద‌ట‌.అందుకే సెహ్వాగ్ పెళ్లి కోసం జైట్లీ అధికారిక బంగళా కేటాయించారని ఓ టాక్ దీనికి కొన‌సాగింపు అన్న‌ట్లుగా 2014 ఎన్నికల్లో బీజేపీ నేత సాహిబ్ సింగ్ వర్మ తరపున సెహ్వాగ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 
మ‌రోవైపు  విఖ్యాత క్రికెటర్ కపిల్ దేవ్ ను కూడా బీజేపీ త‌న టీంలో చేర్చుకునేందుకు చ‌ర్చ‌లు జ‌రిపింద‌ని టాక్‌. కపిల్ ను రాజ్యసభకు నామినేట్ చేయనుంది బీజేపీ అనే వార్తలూ వచ్చాయి. క‌పిల్‌దేవ్‌తో పాటుగా గౌతమ్ గంభీర్‌ను సైతం రంగంలోకి దించడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. స్థూలంగా బీజేపీకి మోడీ ఇమేజ్‌తో పాటుగా, సినిమా, క్రికెట‌ర్ల ఇమేజ్ కూడా తోడ‌య్యేలా ఉందంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.