చంద్రబాబు… ఓ మనసున్న మనిషి  !

చంద్రబాబు నాయుడు ఫక్తు రాజకీయ నాయకుడు. రాజకీయాల్లో అపర చాణుక్యుడు. వ్యూహప్రతివ్యూహాలలో దిట్ట. ఎంతటి వారినైనా మార్చగలిగే మనిషి. ఏమార్చగలిగే మనిషని గిట్టని వారి అభిప్రాయం. అయితే, ఇదంతా నాణానికి ఒక వైపే. 
చంద్రబాబు నాయుడిలో చాలామందికి తెలియ‌ని మరో కోణం కూడా ఉంది. అది ఆయన ఎప్పుడూ బయటపెట్టలేదు. ఆయన సన్నిహితులు కూడా ఎందుకో ఆ కోణాన్ని ఎక్కడా ఆవిష్కరించలేదు. చంద్రబాబు నాయుడిలో ఉన్న ఆ మరో కోణమే కుటుంబం. ఎప్పుడూ రాజకీయ నాయకులు, రక్షణ సిబ్బంది వలయంలో ఉన్నట్టుగానే చంద్రబాబు నాయుడి లోలోపల కూడా ఓ కుటుంబ రక్షణ కోణం దాగి ఉంది. బహిరంగంగా కనిపించే రక్షణ వలయం… చంద్రబాబు నాయుడిలోని లోపలి మనిషిని ఏనాడూ ఆవిష్కరించే అవకాశం కల్పించలేదు. ప్రపంచంలో ఏ వ్యక్తికి అయినా దాచేస్తే దాగని సత్యాలు అనేకం ఉంటాయి. అవి ప్ర‌త్యేక సంద‌ర్భాల‌ను బట్టి వెలుగులోకి వస్తాయి. చంద్రబాబు నాయుడు కూడా అందుకు అతీతుడేం కాదు. కనులు లేవని కలలు రాకుండా పోతాయా. కన్నీళ్లు ఇంకిపోతాయా. చంద్రబాబు నాయుడిలోనూ అంతే. ఆయన కలలు కంటారు. కన్నీళ్లు పెట్టుకుంటారు. అయితే ఇదంతా అంతర్గతంగానే…. మనసు పొరల్లోనే దాగి ఉంటుంది. 
నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయన ఎక్కని మెట్లు లేవు. దిగని పల్లాలు లేవు. గెలుపోటములు ఆయనను వెన్నంటాయి. తోడబుట్టిన వారి నుంచి…. పిల్లనిచ్చిన వారి నుంచి… మిత్రుల నుంచి…. పార్టీలో సన్నిహితుల నుంచి… ఇలా అన్ని వైపుల నుంచి చంద్రబాబు నాయుడిని మానసికంగా ఇబ్బందులు పాలు చేసిన వారు ఉన్నారు. దీనికి ఎవ్వరూ మినహాయింపు కాదు. మామ ఎన్.టి.రామారావును గద్దె దించినప్పుడు నందమూరి కుటుంబ సభ్యులందరూ ఆ ఘటనలో భాగస్వాములయ్యారు. ఆయన తర్వాత ఏర్పడ్డ మంత్రివర్గంలో పదవులు పొందారు. అధికారాన్ని అనుభవించారు. అయితే, ఇప్పటికి ఆ మచ్చ చంద్రబాబు నాయుడ్నే వెంటాడుతోంది. నాలుగంటే నాలుగే అక్షరాలు… వెన్నుపోటు… ఇవే ఆయన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితాన్ని నిరంతరం వేధిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు కుమారులు… కుమార్తెలు… కోడళ్లు…. అల్లుళ్లు… సన్నిహిత బంధువులు…. కుటుంబ స్నేహితులు… ఇలా అందరికీ ఎన్.టి.ఆర్‌.ను పదవి నుంచి తప్పించడంలో పాత్ర ఉంది. అయితే, వీరెవరూ వెన్నుపోటు దారులు కాలేదు. పిల్లి మెడలో గంట కట్టాలని అందరూ అనుకున్నారు. అయితే ఎవరు కడితే వారి పంచన చేరాలని అనుకున్నారు. అందరూ ఒడ్డున కూర్చుని సముద్రంలో మునిగిపోతున్న నందమూరి ఓడను చూస్తున్నారు. మునుగుతున్న ఓడను వెలుపలకు తీసుకువచ్చే వారు మాత్రం వారిలో ఏ ఒక్కరూ లేరు. ఆ సమయంలో ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు ఆ సాహసం చేశారు. కుటుంబాన్ని ఒక వైపు, పార్టీని మరోవైపు కాపాడుకునేందుకు సముద్రంలో దూకారు. కాపాడుకున్నారు. ఓడ ఒడ్డుకు చేరాక నాదంటే నాదని అంతకు ముందు ఒడ్డున ఉన్న వారంతా వాటాలు వేసుకుందుకు ముందుకు వచ్చారు. సముద్రంలో నిండా మునిగిన చంద్రబాబు నాయుడు తడిబట్టలతో అలా చూస్తూ నిలబడిపోయారు. ఇదే కదా… కుటుంబాన్ని రక్షించడమంటే. ఇదే కదా… పార్టీని కాపాడుకోవడమంటే. దీనికి ఎంత సాహసం కావాలి. దీనికి ఎంత నిబ్బరం కావాలి. దీనికి ఎన్ని అవమానాలు భరించాలి. దీనికి ఎన్ని పోరాటాలు చేయాలి. తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమయ్యే జీవన యుద్ధం అర్ధరాత్రి ఎప్పుడో ముగుస్తుంది. ఒక్కోసారి ముగియదు. తెల్లవారుతుంది. మళ్లీ యుద్ధం ప్రారంభం. 
నాలుగు రోజుల క్రితం అదే జరిగింది. తెలతెల్లవారుతుండగా బావమరిది హరిక్రిష్ణ వాహనం ప్రమాదానికి గురైంది.  అప్పుడే దినచర్యకు ఉపక్రమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన వ్యక్తిగత సిబ్బంది ఈ విషయాన్ని చెప్పారు. “నిజమేనా… మళ్లీ తెలుసుకోండి. ఆయన డ్రైవింగ్ సీట్లో ఉండడమేమిటీ” ఈ మాటలు చంద్రబాబు నాయుడి నోటి నుంచి వచ్చిన తొలి పలుకులు. ఇందులో రాజకీయం లేదు. ఇందులో స్వార్ధం లేదు. ఇందులో మర్మం లేదు. ఉన్నదంతా ఓ శోకం. ఓ ఆవేదన. ఆందోళన. అంతే. ఈ సమయంలోనే చంద్రబాబు నాయుడిలోని కుటుంబ సెద్ద బయటకు వచ్చాడు. శుభాలను…. ఆనందాలను… సంతోషాలను.. పంచుకునేందుకు అందరూ ముందుకు వస్తారు. దుఃఖానికి మాత్రమే లోకం ఒంటరైపోతుంది. దుఃఖానికి మాత్రం లోకం తల దించుకుంటుంది. దుఃఖానికి మాత్రమే లోకం దిక్కులు చూస్తుంది. తండ్రి… సినిమాలు… కుటుంబం… తప్ప ఏమీ తెలియని ఇద్దరు కుమారులకు ఈ ఘ‌ట‌న‌తో శోకం తప్ప ఏమీ తెలియడం లేదు. తండ్రిని కోల్పోయిన కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్.టి.రామారావులను అక్కున చేర్చుకున్నది ముందుగా చంద్రబాబు నాయుడే. అంత వరకూ వారిద్దరిని బంధువులు దూరంగా ఉండి గమనిస్తున్నారే తప్ప వారి దగ్గరకు వచ్చి వారిని ఓదార్పు ఇచ్చిన వారు మాత్రం కనిపించ లేదు. అయితే చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రిని అన్న విషయాన్నే మరచిపోయి…. హరిక్రిష్ణ కుమారులను ఓదార్చే పనిని తానే స్వయంగా తీసుకున్నారు. అంత్యక్రియలకు తానే అన్నీ అయి పనులను పర్యవేక్షించారు. చివరికి అంతిమ యాత్రకు అవసరమైన రథాన్ని ఎలా అలంకరించాలో కూడా చంద్రబాబు నాయుడే పర్యవేక్షించారని అక్కడే ఉన్న సీనియర్ జర్నలిస్టు చెప్పారంటే కుటుంబం పట్ల ఆయన ఎంత శ్రద్ధ చూపారో అర్ధం చేసుకోవచ్చు. 
చంద్రబాబు నాయుడి ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలోనే చూసే ప్రతిపక్షాలు…. స్వపక్షం తెలుగుదేశం నాయకులు, రాజకీయ విశ్లేషకులకు హరిక్రిష్ణ మరణం తర్వాత ఓ కొత్త చంద్రబాబు నాయుడు కనిపించారు. ఇది వయసు మీద పడుతున్న సమయంలో వచ్చిన ప్రేమానురాగాలు కావని, కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా ఆయన వ్యవహరించే తీరు ఇలాగే ఉంటుందని చంద్రబాబు నాయుడి సన్నిహితులు చెబుతున్నారు. హరిక్రిష్ణ మరణం తర్వాత తిరుపతిలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడ కూడా తన తమ్ముడి ఇంటికి వెళ్లి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణతో పాటు కొందరు అధికారులతో కలిసి వెళ్లిన చంద్రబాబు నాయుడు వారందరిని ఇంటి బయటే ఉంచేసి తానొక్కరే తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడి యోగక్షేమాలు తెలుసుకుందుకు వెళ్లారు. ఇంటి పెద్దగా వారి బాధ్యత తనపై ఉందని, మనసులో ఎలాంటి ఆందోళన చెందవద్దని తమ్ముడికి భరోసా ఇచ్చారు. రామ్మూర్తి నాయుడి పక్కనే కూర్చుని ఓదార్చారు. ఆయన కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ భుజంపై చేయి వేసి దగ్గరకు తీసుకున్నారు. అయితే ఇవేవీ పత్రికల్లో రాలేదు. చంద్రబాబు నాయుడిలోని ఈ కోణం అటు ప్రజలకు కాని, ఇటు కుటుంబసభ్యులు, తెలుగుదేశం నాయకులకు కాని తెలియకపోవడమే పెద్ద విషాదం. 
అంద‌రూ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ని, వారిద్ద‌రి వైరం ఆజ‌న్మాంతం ఉంటుంది అనుకున్నారు. వారిద్ద‌రిని ఆగ‌ర్భ  శత్రువులుగానే చూశారు. వారే దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్.రాజ‌శేఖ‌ర రెడ్డి, నారా చంద్ర‌బాబు నాయుడు. వారిద్ద‌రి శ‌త్రుత్వం కేవ‌లం రాజ‌కీయాల‌కే ప‌రిమిత‌మైంద‌ని వై.ఎస్. రాజ‌శేఖ‌ర రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత తెలుసుకున్నారు. ఆయ‌న మ‌ర‌ణం చంద్ర‌బాబు నాయుడ్ని చాలా క‌ల‌చివేసింది. తానొక మంచి స్నేహితుడ్ని కోల్పోయాన‌ని చంద్ర‌బాబు నాయుడు స‌న్నిహితుల వ‌ద్దే కాదు… మీడియా ముందు కూడా చెప్పారు.  రాజ‌శేఖ‌ర రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత కూడా చంద్ర‌బాబు నాయుడ‌బు క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఇది ఎవ‌రూ ఊహించ‌లేదు. పైగా ఆరోజు మ‌న ముఖ్య‌మంత్రిని వెత‌కండి..తెలుగుదేశం శ్రేణులంతా పాల్గొనండ‌ని బ‌హిరంగంగా పిలుపునిచ్చారు చంద్ర‌బాబు. ఇది చంద్ర‌బాబు నాయుడిలో దాగి ఉన్న సున్నిత మ‌న‌స్సును తెలియ‌జేస్తుంది. వైఎస్ విష‌యంలో గ‌మ‌నించాల్సిన మ‌రో విష‌యం ఏంటంటే… వైఎస్ హ‌యాంలో చంద్ర‌బాబు విచార‌ణ‌లు ఎదుర్కొనే ప‌రిస్థితి వ‌చ్చినా ఏ రోజూ వైఎస్ మీద మాట తూల‌లేదు. గౌర‌వ‌నీయ ప‌ద‌జాలంతోనే సంభాషించారు.  ఇంకా చంద్ర‌బాబు రాజ‌కీయాల్లో ఎవ‌రిపై కూడా దుర్భాష‌లాడ‌రు. అంత స్వీయ క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉంటారాయ‌న‌.
 
తెలుగుదేశం పార్టీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కింజారపు ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు కంట తడి పెట్టుకున్న చంద్రబాబు నాయుడ్ని ఎందరు చూశారు. తన కన్నీళ్లు చూస్తే ఎర్రన్నాయుడి కుటుంబ సభ్యులు ఎక్కడ కలత చెందుతారో అని ఆ కన్నీళ్లను కంట్లోనే దాచుకున్నారు చంద్రబాబు నాయుడు. అయితే ఎంతో సేపు ఉండబట్టలేకపోయిన చంద్రబాబు నాయుడి కళ్ల వెంట నీరు రావడం టీవీ కెమెరాల కంట్లో పడి పడింది.  ఇది చంద్రబాబు నాయుడి మానసిక స్థితి. దీన్ని గమనించని వారు చంద్రబాబు నాయుడిలో ఉన్న రాజకీయ నాయకుడినే చూసారు. రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడికి వందకు వంద శాతం మార్కులు వేసే వారు ఆయనలోని మానవత్వాన్ని చూడకపోవడం మరో విషాదం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రజల బాగోగులకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో…. కుటుంబ పెద్దగా కుటుంబసభ్యుల గురించి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారనడానికి వెలుగు చూడని ఎన్నో వాస్తవాలున్నాయి. అవును చంద్రబాబు నాయుడిలోని మరో కోణాన్ని ఆయన భార్య భువనేశ్వరి, మరికొందరు సన్నిహితులు మాత్రమే చూసారు. అందుకే వారికి  చంద్రబాబు నాయుడి పట్ల అత్యంత గౌరవం… ప్రేమ… అనురాగం… !!
బుచ్చి రామ్ ప్రసాద్, APNRT Chief Coordinator, USA

2 Comments

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.