వైకాపాలో కోటంరెడ్డి కలకలం

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పగలే చుక్కలు కనపడుతున్నాయి. తప్పు చేశారా లేదా అనే సంగతి పక్కన పెడితే మీడియాలో పెద్ద ఎత్తున ఆయన కేసు గురించి ప్రచారం రావడంతో కలవరపడుతున్నారు. నియోజకవర్గంలో ఆయన వైరి వర్గం సోషల్ మీడియా ద్వారా ఆయనపై వచ్చిన కేసులను ప్రస్తావిస్తోంది. ఫేస్ బుక్, వాట్సప్ లలో విపరీతంగా షేర్లు చేస్తోంది. ఫలితంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కోటంరెడ్డిని కాస్తంత తగ్గి ఉండాలనే మధ్యే మార్గంగా కొందరు నేతలు చెప్పారు. అయినా సరే వెనక్కు తగ్గలేదు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. నేను తప్పు చేయలేదు. మీకు చేతనైంది చేసుకోండని చెప్పారాయన. అందుకే మాకు చేతనైంది చేస్తామంటూ ఆయన కేసుపై కూపీ లాగడం మొదలు పెట్టింది ఏసీబీ. 
అందుకే ఇప్పుడు వార్తల్లోకి వచ్చారు. నెల్లూరు కేంద్రంగా సాగిన బెట్టింగ్ రాకెట్ కు ఆయన సూత్రధారి అనే ప్రచారం సాగుతోంది. నిజంగా ఆ కేసులో కోటంరెడ్డి నిందితుడు అయితే పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయాలి. ఏడాదిన్నరగా ఆయన పరారీలో ఉన్నారని పోలీసు అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఈ ఏడాదిన్నరలో వందల కార్యక్రమాల్లో కోటంరెడ్డి పాల్గొన్నారు. వాటికి పోలీసు అధికారులు హాజరయ్యారు. కానీ విచిత్రమైన వాదన తెరపైకి రావడం ఆశ్చర్యంగా ఉంది. 
అసలు సంగతి ఏంటంటే…
నెల్లూరుకు చెందిన కృష్ణసింగ్ అనే వ్యక్తి బెట్టింగ్ రాకెట్‌కు సూత్రధారి. అతనికి కోటంరెడ్డి మెంటార్‌గా వ్యవహరించారనేది ఆరోపణ. వారిద్దరు విజయవాడలో హోటల్లో కలిశారట. కృష్ణసింగ్‌తో కోటంరెడ్డి కలసి ఉన్న దృశ్యాలు పోలీసులకు చిక్కాయట. అంతే కాదు… కృష్ణసింగ్ పరారీ అయినప్పుడు ఆయన్ను అజ్ఞాతంలో ఉంచటానికి కోటంరెడ్డి సాయం చేశారనేది మరో ఆరోపణ. కృష్ణ సింగ్ నుంచి రూ. 23 లక్షలు కోటంరెడ్డి పుచ్చుకున్నట్లు ఆధారాలు కూడా పోలీసులకు లభించాయని చెబుతున్నారు. అంతే కాదు.. నెల్లూరు ఎస్పీ రామకృష్ణ ఈ కేసును ఉన్నతాధికార్లకు అప్పగించడం హాట్ టాపికైంది. .
నంద్యాల ఉప ఎన్నికల సమయంలో.. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలను పోలీసులు విచారణకు పిలిచారు. వాటి ఆధారంగా కోటంరెడ్డికి పోలీసులు సమన్లు పంపారు. మీకు చేతనైంది చేసుకోవాలని ఆయన సవాల్ విసరడంతో పోలీసులకు కాలింది. అంతే అంత మాట అంటారా చూడండి అని ఆధారాలు సేకరించారంటున్నారు. ఏకంగా కోటంరెడ్డిపై కేసు పెట్టడమే కాదు… ఛార్జ్‌షీట్‌ ను కోర్టుకు పంపారు. క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడిన కృష్ణసింగ్‌, బుకీలు, పంటర్లతో శ్రీధర్ రెడ్డి పరిచయాలు, లావాదేవీలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. సెక్షన్‌ -3, ఏపీ గ్యాంబ్లింగ్‌ యాక్ట్‌ కింద వారిని ప్రోత్సహించిన వైనంపై కోటంరెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు సిద్దమయ్యారు.
పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ మేరకు మే 14న హాజరుకావాలని కోర్టు సమన్లు పంపింది. మరోవైపు నెల్లూరు ఎస్పీ రామకృష్ణ కోటంరెడ్డి వ్యవహారంపై పూర్తి ఆధారాలను సేకరించారు. డీజీపీ మాలకొండయ్యకు వాటిని సమర్పించారు. ఆ తర్వాత విచారణ పనిని ఏసీబీకి అప్పగించారు డిజిపి. ఏసీబీ యాక్ట్ కింద కోటంరెడ్డి మీదు కేసు నమోదైంది. ఏడాదిన్నర కింద కేసు నమోదు అయితే ఇప్పటి వరకు ఎందుకు ఊరుకున్నారనేది తెలియదు. అయినా సరే… కోటంరెడ్డిని హెచ్చరించిన తర్వాతనే.. ఈ కేసు వచ్చిందనే వాదనుంది. తాను తప్పు చేయలేదని.. కోర్టుకు అయినా వెళతానని చెబుతున్నారు కోటంరెడ్డి. విషయం ఏదైనా వైకాపా ఎమ్మెల్యే పై ఆరోపణలు రావడంతో ఆ పార్టీలో కలకలం రేగుతోంది. 
బహిరంగంగా ప్రయాణీకులు, ఆర్టీసీ అధికారులను కొట్టిన కేసులో చింతమనేని వంటి వారిపై చర్యలు తీసుకునే సాహసం చేయడం లేదు టీడీపీ ప్రభుత్వం. విపక్ష నేత కాబట్టి అది కూడ సమయం తీసుకుని ఆయన్ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. చట్టం దృష్టిలో అంతా సమానమే. కానీ టీడీపీకి ఒక చట్టం. వైకాపాకు మరో చట్టం ఉండవద్దని చెబుతున్నారు మధ్యేవాదులు. మరి సిఎం చంద్రబాబు ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.