కేబినెట్ విస్తరణ.. శాఖలు ఫైనల్ చేసిన బాబు

గత ఎన్నికల్లో కలిసి పని చేసిన టీడీపీ-బీజేపీ కొద్దిరోజుల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. ఏపీ హక్కుల విషయంలో కేంద్రం మోసం చేసిందనే కారణంతో టీడీపీ ఎన్డీయే నుంచి బయటికి వచ్చేసింది. దీంతో కేంద్ర కేబినెట్‌లో ఉన్న టీడీపీ మంత్రులు.. ఏపీ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మంత్రులు రాజీనామాలు చేశారు. కేంద్రం సంగతి పక్కన పెడితే.. ఏపీ కేబినెట్‌లో ఆ రెండు శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. చంద్రబాబు కేబినెట్ విస్తరణ చేయబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేల రాజీనామాతో ఖాళీ అయిన ఈ రెండు శాఖలకు ఇద్దరు కొత్త వారిని తీసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఇది పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మరోసారి కేబినెట్ విస్తరణ తెరపైకి వచ్చింది. అంతేకాదు, దీనికి చంద్రబాబు ఫిక్స్ చేసిన తేదీ.. ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వబోతున్నారు..? అనే విషయాలు బయటికి వచ్చాయి. దీంతో కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడినట్లైంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ విస్తరణకు నవంబర్ 11వ తేదీని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇందులో రెండు శాఖలను భర్తీ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ రెండు శాఖల్లో ఒకటి మైనారిటీ సామాజిక వర్గానికి, మరొకటి ఎస్టీ సామాజికవర్గానికి కేటాయించినట్లు తెలిసింది. మైనారిటీ కోటాలో టీడీపీ నుంచి ఇద్దరు మైనారిటీలు ఎమ్మెల్సీలుగా గెలిచారు. వారిలో ఎన్‌ఎండీ ఫరూక్‌ ప్రస్తుతం శాసనమండలి చైర్మన్‌గా ఉన్నారు. మరో ఎమ్మెల్సీ షరీఫ్‌ ప్రస్తుతం మండలి నుంచి ప్రభుత్వ విప్‌గా ఉన్నారు. వీరిలో ఫరూక్‌నే చంద్రబాబు ఫైనల్ చేశారని తెలుస్తోంది. అలాగే ఎస్టీ కోటాలో ఇటీవల మావోల చేతిలో హత్యకు గురయిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ‌్‌కు చోటు కల్పించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు, ఫరూక్‌కు వైద్య, ఆరోగ్య శాఖ.. శ్రవణ్‌కు దేవాదాయ శాఖ అప్పగించబోతున్నారట. వీళ్ల ఎంపికతో ఈ రెండు సామాజికవర్గాలను కూడా మంత్రి వర్గంలో భర్తీ చేసినట్లు అవుతుందనే కారణంతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడైనా ఏ ఆటంకం లేకుండా విస్తరణ చేస్తారో లేదో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.