5న కేబినెట్ విస్తరణ.. ఆ ఇద్దరికి చోటు

గత ఎన్నికల్లో కలిసి పని చేసిన టీడీపీ-బీజేపీ కొద్దిరోజుల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పుడు కలిసి పని చేయడం వల్ల ఇటు రాష్ట్రంలో.. అటు కేంద్రం ప్రభుత్వంలో రెండు పార్టీలు భాగస్వామ్యంగా ఉండేవి. విభజన హామీల విషయంలో ఏపీని కేంద్రం మోసం చేసిందనే కారణంతో టీడీపీ.. ఎన్డీయే నుంచి బయటికి వచ్చేసింది. అప్పటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య దూరం బాగా పెరిగిపోయింది. ఆసమయంలో కేంద్ర కేబినెట్‌లో ఉన్న టీడీపీ మంత్రులు.. ఏపీ ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు బీజేపీ మంత్రులు రాజీనామాలు చేశారు. ఇక అప్పటి నుంచి ఆ రెండు శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. దీంతో ఆ రెండు శాఖలను ఎవరికైనా అప్పగించాలని నిర్ణయించుకున్న చంద్రబాబు.. మంత్రి వర్గ విస్తరణ చేయబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. రెండు నెలలుగా ఇదే విషయం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. తాజాగా త్వరలో కేబినెట్‌ను విస్తరిస్తామని, నటుడు హరికృష్ణ మరణంతో అది ఆలస్యమైందని సీఎం చంద్రబాబు చెప్పడంతో త్వరలో కొత్త మంత్రులు రాబోతున్నారని తెలిసిపోయింది. దీనికి సంబంధించిన తాజా అప్‌డేట్ ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. విస్తరణకు డేట్ ఫిక్స్ అయిందని, అందులో ఇద్దరికి స్థానం కల్పిస్తున్నారన్నదే ఈ అప్‌డేట్ సారాంశం.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఆరో తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో, దానికి ముందు రోజు అంటే ఈనెల 5న మంత్రి వర్గ విస్తరణ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట. ఇందులో ఒకదానిని ఎస్టీ సామాజిక వర్గానికి, మరొక దానిని ముస్లిం మైనారిటీలకు కేటాయించాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే దేవాదాయ శాఖను ఎస్టీ కోటాలో పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌కు, వైద్య, ఆరోగ్య శాఖ ఓ ముస్లిం నేతకు అప్పగించబోతున్నారని సమాచారం. వాస్తవానికి ఈ కోటాలో గిడ్డి ఈశ్వరికి పదవి ఇవ్వాలని అనుకున్నా.. ఆ మధ్య ఆమె గురించి లీకైన ఒక వీడియో వల్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని వినికిడి. ఇక, ఆ రెండు శాఖల్లో ఒకదానిని ముస్లిం నేతకు అప్పగించాలని చూస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. వైసీపీ నుంచి వచ్చిన వారి కంటే టీడీపీని నమ్ముకుని ఉన్న ముస్లిం నేత అయితేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట చంద్రబాబు. టీడీపీ నుంచి ఇద్దరు మైనారిటీలు ఎమ్మెల్సీలుగా గెలిచారు. వారిలో ఎన్‌ఎండీ ఫరూక్‌ ప్రస్తుతం శాసనమండలి చైర్మన్‌గా ఉన్నందున, మరో ఎమ్మెల్సీ షరీఫ్‌కే మంత్రి పదవి ఇవ్వబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.