c/o కంచరపాలెం మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థ: సురేశ్‌ ప్రొడక్షన్స్‌
నటీనటులు: సుబ్బారావు, రాధా బెస్సి, మోహన్‌ భగత్‌, ప్రవీణ పరుచూరి, కార్తీక్‌ రత్నం, ప్రణీత పట్నాయక్‌, కేశవ కర్రి, నిత్యశ్రీ గోరు తదితరులు.
సంగీతం: స్వీకర్‌ అగస్థి
కూర్పు: రవితేజ
ఛాయాగ్రహణం: వరుణ్‌ చపేకర్‌, ఆదిత్య జవ్వాది
సమర్పణ: రానా దగ్గుబాటి
నిర్మాత: విజయ ప్రవీణ పరుచూరి
దర్శకత్వం: వెంకటేశ్‌ మహా

కమర్షియల్ సినిమాల వందలు కొద్దీ వచ్చే సమయంలో.. మధ్య మధ్యలో వచ్చే కొన్ని సినిమాలు మాత్రమే మనల్ని వేరే ప్రపంచలోకి తీసుకెళ్తుంటాయి. ప్రయోగాత్మక సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న రెస్పాన్స్ ఈ మధ్య మరీ ఎక్కువైంది. దీనిని దృష్టిలో ఉంచుకునే కొందరు సినిమాలు చేస్తున్నారు. అయితే, వాటిలో కమర్షియల్ ఎలిమెంట్స్‌ను మాత్రం మిస్ చేయనీయడంలేదు. కానీ ఇవేమీ లేకుండా అరుదైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే ‘c/o కంచరపాలెం’. దీనిని సురేష్ ప్రొడక్షన్స్ పట్టించుకోకుండా ఉంటే ఈ స్థాయి ప్రచారం వచ్చేది కాదు. సాదాసీదా సినిమాగా తెరకెక్కిన ‘c/o కంచరపాలెం’ కథ ఏంటి..? విదేశాల నుంచి వచ్చి మరీ సినిమాను నిర్మించిన ప్రవీణ అనుకున్నది సాధించారా..? అసలు దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ఏమిటి..? వంటివి తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

కథ
కంచరపాలెం అనే ఊరిలో సాగే సినిమా ఇది. ఇదే ఊరిలో ఉండే రాజు (సుబ్బారావు) గవర్నమెంట్ ఆఫీస్‌లో అటెండర్. 49 ఏళ్లు వచ్చినా.. పెళ్లి చేసుకోకుండా ఒంటిరిగానే ఉండిపోతాడు. అదే ఆఫీస్‌కి అధికారిగా ఒడిశా నుండి బదిలీ మీద వస్తుంది రాధ (రాధ బెస్సీ). భర్త చనిపోయిన ఆమెకు 20 ఏళ్ల కూతురు ఉంటుంది. యాభై ఏళ్లు దగ్గర పడుతున్నా రాజుకి పెళ్లి కాకపోవడంతో ఊర్లో అందరూ ఆయన గురించే మాట్లాడుతుంటారు. అదే టైమ్‌లో రాజు ప్రవర్తన నచ్చి అతని ప్రేమలో పడుతుంది రాధ.

రెండో జంట.. జోసెఫ్ (కార్తీక్ రత్నం), భార్గవి (ప్రణీతా పట్నాయక్). జోసెఫ్ క్రిస్టియన్ టీనేజ్ కుర్రాడు. కంచరపాలెంలో అమ్మోరు జిమ్ ఓనర్‌ దగ్గర పనిచేస్తూ.. సెటిల్ మెంట్‌ల పేరుతో గొడవలకు వెళ్తుంటాడు. అనుకోకుండా బ్రాహ్మణుల అమ్మాయి భార్గవితో గొడవపడి.. ఆ తరువాత ఇద్దరూ ప్రేమలో పడతారు.

మూడో జంట.. గెడ్డం (మోహన్ భగత్), సలీమా(విజయ ప్రవీణ). అనాధ అయిన గెడ్డం కంచరపాలెం వైన్ షాప్‌లో బాయ్‌గా పనిచేస్తుంటాడు. అదే షాప్‌కి ప్రతి రోజు వచ్చి మందు కొంటుంది సలీమా అనే వేశ్య. ఆమె ముఖానికి ముసుగు కట్టుకోవడంతో కళ్లు చూసి ప్రేమిస్తాడు గెడ్డం.

నాలుగో జంట.. సుందరం (కేశవ కర్రి), సునీత (నిత్య శ్రీ). వీళ్లది చిన్ననాటి ప్రేమకథ. ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకుంటూ ఉంటారు. సుందరానికి సునీత అంటే చాలా ఇష్టం. ఆమెతో మాట్లాడాలని తనతో ఉండాలని ప్రయత్నిస్తాడు. సునీత ఇష్టాలనే తన ఇష్టాలుగా మార్చుకుని ఆమె కోసం పరితపిస్తాడు.

ఈ నాలుగు జంటలు చివరికి కలుసుకున్నాయా..? వీరి ప్రేమకథల్లో విలన్లు ఎవరు..? వీరందరికీ మధ్య ఉన్న సంబంధం ఏంటి..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
నాలుగు ఏజ్ గ్రూపులు.. నాలుగు జంటలు.. నాలుగు ప్రేమకథలు మొత్తంగా చెప్పుకుంటే ఇదే ‘c/o కంచరపాలెం’. తెలుగు సినిమా అంటే ఆరు పాటలు, నాలుగు ఫైట్లు అని చెప్పుకునే రోజులు పోగోట్టే సినిమాలు కొన్ని మాత్రమే వస్తున్నాయి. అలాంటి వాటిలో ఈ సినిమా కూడా ఒకటి. జీవితాల్లోంచి వ‌చ్చిన క‌థ‌లు చూపించే ప్ర‌భావ‌మే వేరు. థియేట‌ర్లోకి అడుగుపెట్టిన వెంట‌నే మ‌న‌ల్ని ఓ కొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళ‌తాయి. ఆ క‌థ‌లో మ‌న‌ల్నీ భాగం చేస్తాయి. ప్ర‌తి భావోద్వేగం మ‌న‌దే అనే భావ‌న‌కి గురిచేస్తాయి. బ‌య‌టికొచ్చాక ఆ పాత్ర‌లు నేరుగా మ‌న‌తోపాటే ఇంటికొస్తాయి. స‌రాస‌రి మ‌న హృద‌యాల్లో తిష్ఠ వేస్తాయి. కొన్నాళ్ల‌పాటు వెంటాడుతూ… తీయ‌టి అనుభూతుల్ని, జ్ఞాప‌కాల్ని పంచుతాయి. అలాంటి సినిమాల్లో ‘c/o కంచరపాలెం’ ఒకటని చెప్పవచ్చు. ఒరిజినల్ సౌండ్‌తో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. మధ్య మధ్యలో బూతులు వినిపించినా అవి కూడా కథలో భాగమనే అభిప్రాయం ప్రేక్షకుడి అనిపిస్తుంది. మొత్తంగా ఈ సినిమా కమర్షియల్ హంగులు కోరుకునే వారికి నచ్చకపోవచ్చేమోగానీ.. ప్రయోగాత్మక చిత్రాలను ఇష్టపడేవారికి మాత్రం పంచభక్ష్య పరమాన్నాలు దొరికినట్లే.

నటీనటుల పనితీరు
సినిమా అంతా ఎనిమిది పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఈ ఎనిమిది పాత్రల్లో రాజు పాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది. తనలోని ప్రస్టేషన్‌తో పండించే కామెడీ నవ్విస్తోంది. అతడికి జంటగా నటించిన రాధ పాత్ర కూడా ఎంతో చక్కగా కుదిరింది. ఇక, ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సి పాత్రల్లో గడ్డం పాత్ర ఒకటి. తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరీ నటించాడు. అతడు ఇష్టపడే పాత్రలో నటించిన నిర్మాత ప్రవీణ కళ్లతోనే హావభావాలు పండించి మెప్పించింది. సినిమాపై తనకున్న ప్యాషన్ ఆమె పాత్రలోనే కనిపిస్తుంది. నిర్మాతగా.. నటిగా ఆమె ద్విపాత్రాభినయం చేసింది. అలాగే ప్రేమకు కులమతాలు అడ్డు అనే కాన్సెప్ట్‌తో జోసెఫ్‌, భార్గవిల ప్రేమకథ నడుస్తుంది. ఈ పాత్రల్లో కార్తీక రత్నం, ప్రణీత పట్నాయక్‌లు నటనతో కంటతడి పెట్టించారు. ఇక స్కూల్‌డేస్‌లో ప్రతి ఒక్కరికీ ఓ క్రష్‌ ఉంటుంది. దాన్ని బేస్‌ చేసుకునే దర్శకుడు సుందరం క్యారెక్టర్‌ను రాసుకున్నాడు. అతను నిత్య అనే అమ్మాయి వెంబడి పడటం.. అనుకోకుండా చేసే చిన్న తప్పు వల్ల జీవితం ఎలాంటి మలుపు తిరిగిందనే అంశాలను సన్నివేశాల పరంగా చక్కగా తెరకెక్కించాడు. తండ్రి పాత్రల్లో చేసిన తదితర నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్ల పనితీరు
ఈ సినిమాకు మొదటి క్రెడిట్ దర్శకుడు వెంకటేశ్‌ మహాకే ఇవ్వాలి. తొలి చిత్రమే అయినా అతడు రాసుకున్న కథ.. సన్నివేశాలు సగటు ప్రేక్షకుడిని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. కులం, మతం, వర్గం, వర్ణం, ప్రాంతం ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్‌ని డీల్ చేయాలంటే చిన్న విషయం కాదు. ఈ సినిమాలో ఈ విషయాలన్నింటినీ చాలా సింపుల్‌గా ఎవర్ని నొప్పించకుండా పర్ఫెక్ట్‌గా డీల్ చేశాడు మహా. సినిమా ప్రారంభంలోనే కథలో లీనం చేసిన ఘనత అతడికే దక్కుతుంది. ఇక, ఈ సినిమాలో రెండో హైలైట్ ఆదిత్య జవ్వాడి అండ్ వరుణ్‌ ఛాపేకర్ సినిమాటోగ్రఫీ. ప్రతి ప్రేమ్‌ను కథకు అనుగుణంగా వెతికిపట్టారు. లొకేషన్ల కోసం వెంపర్లాడకుండా సినిమా మొత్తంలో 80 శాతం కంచరపాలెం‌లోనే అందమైన లొకేషన్లు వెతికిపట్టి వాటిని అంతే అందంగా తెరపై ఆవిష్కరించారు. యువ సంగీత దర్శకుడు స్వీకర్ అగ‌స్తి అద్భుతమైన మ్యూజిక్‌తో సినిమా స్థాయిని పెంచారు. రవితేజ గరిజిల ఎడిటింగ్ వర్క్ బాగా కుదిరింది. పెద్ద సినిమాను రెండు గంటల 25 నిమిషాలకు కుదించి ఎక్కడా బోర్ లేకుండా కత్తెరకు బాగా పనిచెప్పారు. కొత్త తరహా సినిమాలను నిర్మించే నిర్మాతలను కూడా అభినందించాల్సిందే. విజయ ప్రవీణ పరుచూరి ఈ విషయంలో ముందుగా అభినందించాలి. అలాగే కొత్త సినిమాను ఎంకరేజ్‌ చేయడానికి ముందుకు వచ్చిన సురేశ్‌ ప్రొడక్షన్స్‌ను అభినందించాల్సిందే.

బలాలు
* హత్తుకునే కథ
* నటీనటుల పనితీరు
* టెక్నీషియన్ల పనితనం
* ఎడిటింగ్

బలహీనతలు
* నిదానంగా సాగే స్క్రీన్‌ ప్లే
* కొత్త ముఖాలు

మొత్తంగా: రొటీన్ రొట్టకొట్టుడు సినిమాల నుంచి విముక్తి కలిగించే కొత్త ప్రయత్నమే ‘c/o కంచరపాలెం’

రేటింగ్: 3.5/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.