టికెట్టు వ‌స్తుందా… రాదా….

విచిత్రమైన రాజకీయాలకు ఎమ్మిగనూరు కేరాఫ్ అడ్రస్‌. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య రాజకీయ సెగలు ఎగసిపడుతుంటే, ఇక్కడ మాత్రం గత నాలుగేళ్ల నుంచి అధికారపక్షానిదే హవా! నియోజకవర్గంలో ప్రతిపక్ష వైసీపీ పరిస్ధితి పూర్తిగా పడకేసినట్లుగా తయారైంది. ఇక అధికార పక్షంలోనే స్థానిక ఎమ్మెల్యేకు, కొంతమంది ద్వితీయశ్రేణి నేతలకు మధ్య పొసగడం లేదు. అయినప్పటికీ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ప్రభావాన్ని నామమాత్రం చేయడంలో ఎమ్మెల్యే బి.వి.జయనాగేశ్వరరెడ్డి సక్సెస్ అయ్యారు. ఇటు సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని కూడా శాంతింపచేశారు. ఎంత చేసినా ఇప్పటికీ కొద్దిమంది నేతలు ఎమ్మెల్యే బివిపై అసంతృప్తిగళం విప్పుతుండటం గమనార్హం. ఈ తరుణంలోనే కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఎమ్మిగనూరు పీఠంపై ఆసక్తి కనబరుస్తున్నారంటూ గుసగుసలు మొదలయ్యాయి. ఎంపీ బుట్టా రేణుక వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తారని వైసీపీలో ఉన్నప్పటినుంచి ప్రచారం జరిగింది.
రానున్న ఎన్నికల్లో బుట్టా వర్సెస్ బీవీ మధ్య పోటీ ఉంటుందని అధికార, విపక్షాల నేతల మధ్య మాటలు కూడా వినిపించేవి. అయితే ఆమె వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాక కూడా ఇదే తరహా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే నియోజకవర్గానికి చెందిన కొందరు టీడీపీ నేతలు రహస్య సమావేశం పెట్టుకున్నారట. “2019 సాధారణ ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి పోటీచేయండి. బంపర్ మెజారిటీతో మీరు గెలుస్తారు. అందుకు మేము పూర్తిగా సపోర్టు చేస్తాం. మీరు ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలవాల్సిందే” అంటూ ఆ నేతలు ఎంపీ బుట్టా రేణుకతో చెప్పారట. “మీరు గనుక ఎమ్మిగనూరు నుంచి గెలిస్తే మంత్రి అవడం ఖాయం” అని కూడా ఆ నేతలు రేణుకతో అన్నారట. మరోవైపు ఎంపీ బుట్టా రేణుకకు చెందిన క్యాడర్ సైతం ఎమ్మిగనూరు నుంచి పోటీచేయాలని ఆమెపై వత్తిడి తెచ్చారట. అయితే ఇవన్నీ ఇప్పుడు పాత సంగతులుగా మారిపోయాయి. ఎందుకంటే తాజాగా ఆమె తన మనసులో ఉన్న మాట చెప్పేశారు. “కుట్ర, కుతంత్రాలతో కూడిన రాజకీయం చేయలేను. సీఎం చంద్రబాబు సూచనల మేరకు వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీగానే బరిలో నిలుస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మిగనూరు నుంచి పోటీచేయను” అని రేణుక స్పష్టంచేశారు. దీంతో ఎమ్మెల్యే బి.వి.జయనాగేశ్వరరెడ్డి టిక్కెట్‌కి ఎలాంటి పోటీ ఉండదని తేలిపోయింది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే బి.వి. జయనాగేశ్వరరెడ్డి నియోజకవర్గంలో స్పీడు పెంచారు. తను చేపట్టిన అభివృద్ధి పనులను వివరించేందుకు ప్రజల్లోకి వెళ్తున్నారు. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తి చేశానని చెప్తున్నారు. 325 కోట్ల వ్యయంతో ఎమ్మిగనూరులో రోడ్ల విస్తరణ చేపట్టినట్టు గుర్తుచేస్తున్నారు. ఆర్డీఎస్ కుడి కాలువ సర్వే పనులు, 65 కోట్ల రూపాయల ఖర్చుతో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల విస్తరణ వంటివి తన హాయాంలో జరిగిన మంచి పనులుగా స్పష్టంచేస్తున్నారు. గాజులదిన్నె నుంచి పైపులైను కోసం 126 కోట్ల రూపాయల మంజూరు, గోనెగండ్ల మండలంలో 13 కోట్ల ఖర్చుతో 11 గ్రామాలకు మంచినీటి పథకం వంటివి మరికొన్ని ప్రజాపయోగ పనులుగా చెబుతున్నారు. చేనేత వర్గాలకు ఉపాధి కల్పించే టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం, చేనేత క్లస్టర్ ఏర్పాటు, నాగలదిన్నె వంతెన వంటి పనులు చేపట్టాల్సి ఉందని ఎమ్మెల్యే బి.వి. వివరిస్తున్నారు. ఈ పనులను కూడా త్వరలోనే పూర్తిచేసి ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల కడగండ్లు తీరుస్తానని హామీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే, స్థానిక వైసీపీలో బలమైన నేతగా కొనసాగుతున్న కేశవరెడ్డి తన రాజకీయ అనుభవాన్ని మేళవించి పాత క్యాడర్‌ను ఏకంచేస్తూ.. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. 
2014 ఎన్నికల్లో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యే బి.వి.జయనాగేశ్వరరెడ్డి వచ్చే ఎన్నికల్లో కూడా విజయసాధనకి ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టారు. ఆయనకి టిక్కెట్‌ విషయంలో ఏర్పడిన సస్పెన్స్‌కి తెరపడటంతో.. ఇకముందు ఆయన మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అమలు కాని వాటిపై దృష్టి సారించి .. వాటిని పట్టాలు ఎక్కిస్తే ఆయనకి తిరుగుండదన్న భావన ఏర్పడింది. గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కేశవరెడ్డి వైసీపీ పక్షాన తన కుమారుడు జగన్మోహన్‌రెడ్డిని ఇక్కడ బరిలోకి దింపారు. కానీ ఆయన ఒడ్డెక్కలేకపోయారు. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో కేశవరెడ్డే పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. చూద్దాం.. ఆయన వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.