బాబును ఇబ్బంది పెట్టిన మైకు…

లక్షలాది మంది హాజరైన సభలో మైకు పనిచేయకపోతే ఏమవుతుంది? ఆడియో లెవల్స్‌లో తేడా వస్తే ఏం జరుగుతుంది..? అప్పుడు నాయకుల పరిస్థితి ఎలా ఉంటుంది..? అరచి అరచి గొంతు జీరపోతుందా..? ఆ అరుపులకు అర్ధరాత్రి వరకు నిద్రపట్టకుండా ఉంటుందా..? నిజంగా మైకు అంత పవర్‌ఫుల్లా..? అవుననే అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. మొన్నటి సమన్వయ కమిటీ సమావేశంలో సీనియర్‌ మంత్రులు.. జిల్లా పార్టీ అధ్యక్షులు … ఎమ్మెల్యేలకు మైకుతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించారు చంద్రబాబు.. విజయవాడ మహానాడులో ఇదే జరిగిందట! మొదటి రోజునే మైకు మొరాయించిందట! చంద్రబాబుకు తలనొప్పులను తెచ్చిపెట్టిందట! చంద్రబాబు మాట్లాడుతున్నది వెనుక వరుసలో కూర్చున్నవారికి అసలు వినపడలేదట! ఈలలు కేకలు వేశారట! రెండు నిమిషాల పాటు సౌండ్‌ సిస్టమ్‌ నిర్వాహకులు అటూ ఇటూ పరుగులు తీసి ఎలాగోలా మైకును సరి చేసినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయిందట! దాంతో తన మూడంతా చెదిరిపోయిందని సమన్వయ కమిటీలో చెప్పుకొచ్చారు చంద్రబాబు! విశాఖపట్నం మహానాడులో అన్ని ఏర్పాటు బాగా ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు లేవని నిలదీశానని చంద్రబాబు అన్నారు.
రెండోరోజు… మూడో రోజు కూడా తనకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యిందని.. ఫలితంగా తన గొంతు పోయిందని సీఎం అన్నారు. విశాఖపట్నం మహానాడులో మైకు బాగా పని చేసి… విజయవాడ మహానాడులో ఎందుకు పని చేయలేదో తనకు వివరణ ఇవ్వాలని నిర్వాహకులను ఆదేశించినా తన వద్దకు ఎవరూ రాలేదని పార్టీ నేతలకు చెప్పారు చంద్రబాబు. మైకు పని చేయకపోవడంతో అరచి అరచి గొంతు పోయిందని, రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టలేదని చెప్పారు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండే పార్టీ నేతలు ఇలా ఎందుకు నిర్లక్ష్యం చేశారో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంమీద మైకుతో తనకున్న అనుబంధాన్ని వివరించిన చంద్రబాబు తొలుత ఆగ్రహించి.. ఆ తర్వాత చురకలు వేసి.. అటు పిమ్మట జోకులతో అందరినీ నవ్వించారు.. సమావేశంలో పాల్గొన్న నేతలు మొదట టెన్షన్‌ పడ్డా.. ఆ తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.