నాటి బొత్స వైభవం నేడు ఏమైంది?

అనుచ‌రుల మ‌ధ్యే విమ‌ర్శ‌లు:
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అటు తెలంగాణాలో, ఇటు ఆంధ్రాలో ఓ వెలుగు వెలిగిన నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎదురులేని నేతగా ఎదిగారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రజాందోళన మొదలుకొని  కాపుల ఉద్యమం వరకు ఆయన త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నార‌ని అనుచరులే వ్యాఖ్యానిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఒకప్పుడు వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న బొత్స సత్యనారాయణకి విమర్శల పాలయ్యే స్థితి రావ‌డం వెనుక చాలా కార‌ణాలున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో విజయనగరం జిల్లా అంతా ఒకే తాటిపైకి వచ్చినప్పుడు ఆయ‌న‌ “తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటీ” అని వ్యాఖ్యానించారు. దీంతో నాడు పీసీసీ అధ్యక్షునిగా ఉన్న సత్తిబాబు సూచనతోనే రాష్ట్రం రెండు ముక్కలైందని జిల్లావాసులు అనుకున్నారు. ఒకానొక దశలో ఆందోళనకారులు ఆయన ఇల్లు కూల్చేయాలని కూడా ప్రయత్నించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించటం, కర్ఫ్యూ పెట్టించారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో సత్తిబాబు పై వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. కాలక్రమంలో ప‌రిస్థితుల‌న్నీ మారిపోయి కాపుల ఉద్యమం త‌లెత్తింది. ఉత్తరాంధ్రలోని తూర్పు కాపు కులం బలంగా ఉంది. ఈ సామాజికవర్గానికి చెందిన సత్తిబాబును అభిమానించే వారి సంఖ్య కూడా ఎక్కువ‌గానే ఉంది. స్థానిక కాపు నేత‌లు గొర్లె శ్రీరాములునాయుడు, కిమిడి కళావెంకట్రావు, బొత్స సత్తిబాబు తమ తూర్పుకాపు కులం నుంచి ఎదిగిన గొప్ప నాయకులని ఆ వ‌ర్గంవారు చెప్పుకుంటారు. కాగా విజయనగరం జిల్లాలో బొత్సకు వ్యతిరేకవర్గంగా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామితో ఉన్న కొందరు తూర్పుకాపు నేతలు బీసీ-ఏ క్యాటగిరీలో తమ వారిని చేర్చాలన్న నినాదాన్ని వినిపిస్తున్నారు. కాగా జగన్ చెప్పిన మేరకే ముద్రగడ పద్మనాభానికి సత్తిబాబు మద్దతు తెలిపారనీ, అది ఆయన వ్యక్తిగత వ్యవహారం కాదనీ, పార్టీ నిర్ణయమని మరి కొంతమంది సత్తిబాబు అనుచ‌రులు చెబుతున్నారు. కాగా సత్తిబాబు ఇరకాటంలో పడటానికి స్వ‌యంగా ఆయనే కారకుడని జిల్లావాసులు చెప్పుకుంటున్నారు. ఏదిఏమైనప్పటికీ బొత్స‌కు పూర్వవైభవం తిరిగి దక్కాలంటే తిరిగి పక్కా ప్రణాళికతో నడుచుకోవడం అవ‌స‌ర‌మని ప‌లువురు సూచిస్తున్నారు. లేదంటే బొత్స స్వ‌యంకృతాప‌రాధిగా మిగిలిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.