వైసీపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది. దీనికి తోడు జనసేన పార్టీ ఫామ్‌లోకి రావడం.. కాంగ్రెస్, బీజేపీ కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే కనుక జరిగితే వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ ఓడిపోవడం ఖాయం. కాబట్టి ప్రభుత్వాన్ని కోలుకోలేని దెబ్బకొట్టాలని, తద్వారా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇందుకోసం బలమైన స్థానాల్లో పట్టు నిలుపుకుంటూనే, బలహీనమైన స్థానాల్లో విజయం సాధించాలనుకుంటోంది. మరోవైపు, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టాలనుకుంటున్న ఆ పార్టీకి ప్రస్తుతం ఎదురుగాలి వీస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. అంతేకాదు, ఆ పార్టీ ఏం చేసినా అది ప్రతికూలంగానే మారుతోంది. మొన్నటి వైసీపీ ఎంపీల రాజీనామా నుంచి ఆ పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా అవన్నీ టీడీపీకే అనుకూలం అవుతున్నాయి. తాజాగా మరో పరిణామం ఆ పార్టీలో కల్లోలానికి కారణం అవుతోంది.

టీడీపీని దెబ్బకొట్టాలని భావించిన జగన్.. ఆ పార్టీలోని నేతలకు వల విసిరాడు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ నెల రెండున వైసీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడిదే ఆ పార్టీలో లుకలుకలకు కారణం అవుతోంది. ఆనం చేరికను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న మేకపాటి వర్గం.. చేరిక కార్యక్రమానికి గైర్హాజరయింది. దీనిని పక్కనపెడితే, వెంకటగిరి వైసీపీ ఇన్‌చార్జి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి కూడా దీనికి హాజరు కాలేదు. ఆనం రామనారాయణరెడ్డి పార్టీలో చేరడం, ఆయనకు వెంకటగిరి స్థానాన్ని కేటాయిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. నాలుగేళ్లుగా వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉంటున్నా అధిష్ఠానం కనీస విలువ ఇవ్వలేదన్న ఆవేదనతో ఆయన జగన్‌ విశాఖలో నిర్వహించిన తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ సమావేశానికీ రాలేదు. అంతేకాదు, ఇంతకాలం పార్టీ కోసం నియోజకవర్గంలో కష్టపడిన తనను అధిష్టానం అవమానపరిచేలా వ్యవహరిస్తోందని ఆ పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనతో టీడీపీ నేతలు మంతనాలు జరిపారని, అన్నీ వర్కౌట్ అయితే సైకిల్ ఎక్కే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీని ఇరుకున పెట్టాలని ఒక నేతను చేర్చుకుంటే అది కాస్తా వికటించి పలువురు పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని టాక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.