కొన్ని ప్రాంతాలకే పరిమితమైన బీజేపీ

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి అధిక సీట్లు వచ్చినా అది కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. 103 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినా దాని హవా కొన్ని ప్రాంతాల్లోనే కొనసాగింది. కాంగ్రెస్‌ 78 చోట్ల, జేడీఎస్‌ 38 చోట్ల విజయాలను నమోదు చేసుకున్నా… ఇంకొన్ని ప్రాంతాల్లో అవి అసలు సీట్లను సాధించలేక పోయాయి. పాతమైసూరులోనే జేడీఎస్ ప్రభావం చూపగా.. మధ్య కర్నాటకలో ఒక్క సీటు ఆ పార్టీకి రాలేదు. కోస్తా కర్నాటకలో బీజేపీ సుడిగాలి విజయం సాధించగా… హైదరాబాద్ కర్నాటకలో ఆ ప్రభావం పడలేదు. అక్కడ కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వచ్చాయి. ఒక్కసారి ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయో చూద్దాం…
ముంబై-కర్నాటక…
ఇక్కడ మొత్తం సీట్లు 50 ఉన్నాయి. ముంబై కర్ణాటక ప్రాంతంలో బీజేపీ తన ప్రతాపాన్ని చూపింది. ఉత్తర కర్ణాటకలోని 30 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, 17 చోట్ల కాంగ్రెస్‌ గెలిచింది. రెండుచోట్ల జేడీఎస్, ఓ స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మహారాష్ట్రతో సరిహద్దు, సంస్కృతి ప్రభావం వల్ల బీజేపీ బాంబే కర్ణాటకలో విజయం సాధించింది.  
మైసూరు వారిదే…
మైసూరులో మొత్తం సీట్లు 55 ఉన్నాయి. మైసూరు ప్రాంతంలో పోటీ సాధారణంగా కాంగ్రెస్, జేడీఎస్‌ మధ్యే ఎప్పుడూ ఉంటోంది. ఈ ప్రాంతంలో అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీనే అధికారంలోకి వస్తూ ఉంటోంది. కానీ ఈ సారి బీజేపీకి 9 స్థానాలు వచ్చాయి. తమ కంచుకోట అయిన మైసూరులో జేడీఎస్‌ 28 స్థానాల్లో, కాంగ్రెస్‌ 17 చోట్ల విజయం సాధించాయి.
కోస్తా కర్ణాటకలో కమలం…
కోస్తా కర్ణాటక ప్రాంతంలో మొత్తం 21 సీట్లున్నాయి. వాటిలో 18 చోట్ల కమలం పార్టీ విజయం సాధించింది. 2008 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 14 సీట్లలో గెలుపొందగా, 2013లో మాత్రం 5 స్థానాలకు పడిపోయింది. కోస్తా ప్రాంతంలో తిరిగి తన పాత వైభవాన్ని తీసుకువచ్చే పని చేసింది. ఇక్కడ కాంగ్రెస్‌ కేవలం మూడు సీట్లలో గెలవగా, జేడీఎస్‌ ఖాతా తెరవలేదు.
మధ్య కర్ణాటకలోను…
మధ్య కర్నాటకలో మొత్తం సీట్లు 35 ఉన్నాయి. ఇక్కడ కమలం పార్టీ హవా కొనసాగింది. 24 చోట్ల బీజేపీ, 11 స్థానాల్లో కాంగ్రెస్‌లు గెలిచాయి. ఇక్కడ లింగాయత్‌లు అధికం. యడ్యూరప్ప అదే వర్గం. ఈశ్వరప్పలాంటి బీజేపీ నేతలు ఇక్కడ పోటీ చేశారు. వారే కాదు… గాలి జనార్దన రెడ్డి సోదరులు, శ్రీరాములు వర్గ పలుకుబడి ఇక్కడ ఎక్కువగా ఉంది. అందుకే ఎక్కువ సీట్లు తెచ్చుకుంది.   
హైదరాబాద్- కర్ణాటకలో హస్తం హవా
హైదరాబాద్ కర్నాటకలో తెలుగువారు ఎక్కువ. అక్కడ మొత్తం సీట్లు 31 ఉన్నాయి. హైదరాబాద్‌ కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్‌కు 15, బీజేపీ 11, జేడీఎస్‌ 4 స్థానాలు వచ్చాయి. గతంతో పోలిస్తే ఈ ప్రాంతంలో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. 2013తో పోలిస్తే బీజేపీ ఈసారి ఆరు స్థానాలు ఎక్కువగా సాధించింది. మొత్తంగా చూస్తే బీజేపీ కొన్ని చోట్లకే పరిమితం కావడం కాంగ్రెస్ తన సత్తాను కోల్పోవడం చూస్తున్నాం. జేడీఎస్ కేవలం ఒక ప్రాంతానికి పరిమితం అయి.. తన ఉనికి కోల్పోకుండా జాగ్రత్త పడుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.