టీడీపీ దాడులను తిప్పికొట్టే వ్యూహంలో కమలం

ఏపీ బీజేపీ సమన్వయ కమిటీ సమావేశం వాడి వేడిగా సాగింది. ముఖ్యంగా టీడీపీ తీరును దుయ్యబట్టారు పలువురు నేతలు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తెగ పొగిడేసిన విష్ణుకుమార్ రాజు ఇప్పుడు తమ పార్టీ స్టాండ్ తీసుకోక తప్పలేదు. మనసులో చంద్రబాబు ఉన్నా.. పార్టీ విషయంలో ఆ మాట చెప్పలేరు. అందుకే విష్ణుకుమార్ రాజు కొంత భిన్నంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశంలో చంద్రబాబు మైండ్ గేమ్స్ ఆడుతున్నారని మండిపడ్డారు. విపక్ష నేత జగన్ చేస్తున్న పోరాటానికి వస్తున్న మద్దతు చూసి చంద్రబాబు కూడా మాట మార్చారని ఆయన అన్నారు. జగన్ ను కలుపుకునేందుకు, తమ వాడిగా చెప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని అర్థమవుతోంది. ఏదైనా అధిష్టానం ఆదేశాలను ఆ పార్టీ నేతలు పాటించక తప్పదు. అందుకే టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు నేతలు. 
చంద్రబాబు ఎన్డీఏలో కొనసాగడాన్ని పలువురు బీజేపీ నేతలు తప్పు పట్టారు. మంత్రి పదవులకు రాజీనామా చేశాక ఇంకా ఎందుకు ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబుకు ముందుంది మొసళ్ల పండుగ అని విష్ణుకుమార్‌ రాజు హెచ్చరించడమే ఆసక్తికరంగా మారింది. ప్రత్యేక హోదా అంశంలో తమను ఇబ్బంది పెడితే చూస్తు ఊరుకునేది లేదని కాషాయ దళం చెప్పడం కాస్త ఆశ్చర్యమే. మరోవైపు కంభంపాటి హరిబాబు విరుచుకుపడుతున్నారు. భారతీయ జనతా పార్టీపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని హరిబాబు విమర్శించారు. ఏపీకి కేంద్రం ఏమీ చేయలేదని టిడిపి అంటున్న మాటల్లో నిజం లేదంటున్నారు. 
హోదా ఏది….
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నాటకాలు ఆడింది. ప్యాకేజి విషయంలోను మోసం చేసింది. పార్టీలకతీతంగా నేతలంతా ఇదే మాట చెబుతున్నారు. ప్రముఖులు తమ గళం విప్పుతున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ ఎదురుదాడి వ్యూహంలోకి వెళుతోంది. ఆంద్రప్రదేశ్‌కు కేంద్రం చేయాల్సిన సాయమంతా చేస్తోందని.. విభజన చట్టంలోని పెండింగ్‌ హామీలను నెరవేరుస్తున్నట్లు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఒక్క జాతీయ సంస్థ లేదు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక 9 జాతీయ సంస్థలను ఏర్పాటు చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. మీరు చెప్పేది నిజం అయితే ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదంటే మాత్రం సమాధానం లేదు…
 

1 Comment

  1. ఆంధ్రాకి చేసిన అన్యాయానికి నిరసనగా పార్టీలకు అతీతంగా వస్తున్న దాడిని ఎదుర్కోలేక , అసలైన అగ్రనాయకులు ఢిల్లీలో దాక్కుంటూ , పాపం పిల్లలను ఉసికొల్పితే జరిగేదేమిటో అందరికి తెలుసు . పిల్లలు మాడిపోతారు. ఢిల్లీ సుల్తాన్ లు మాత్రం గుజరాత్ కి దోచిపెడుతూ చోద్యం చూస్తా ఉంటారు .

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.