కమలానికి అహంకార భంగం

ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలుగా సాధారణంగా మూడు వ్యవస్థలు ఉంటాయి. పొలిటికల్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ వ్యవస్థలు మూడూ సమానమైన అధికారాలతో వర్తిస్తుంటాయి. ఏ వ్యవస్థ గాడితప్పి చెలరేగినా మరో వ్యవస్థ ఆ పరిస్థితిని చక్కదిద్దుతూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు రాజకీయ వ్యవస్థ రాజ్యాంగ విలువలకు పాతర వేస్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండగా.. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుని ముకుతాడు వేసేసింది. మొత్తానికి మోడీ అండ్ కో కు అహంకార భంగం తప్పలేదు.

కర్నాటక రాజభవన్ లో గవర్నర్ గా కొలువు చేస్తున్న వాజుభాయి వాలా.. మోడీకి వీరవిధేయుడు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆయన తన స్వామిభక్తిని చాలా చక్కగా ప్రదర్శించుకున్నారు. ఎన్నికల అనంతరం ఏర్పడిన పొత్తులే కావొచ్చు గాక.. కానీ.. స్పష్టతతో కూడిన ఉత్తరాలు కూడా రాసి.. ఎమ్మెల్యేల సంతకాల సహా ఇరు పార్టీల నేతలు వచ్చి తనను సంప్రదించినప్పుడు, పూర్తి మెజారిటీ చూపించినప్పుడు, వారికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వకుండా.. సింగిల్ లార్జెస్ట్ పేరుతో మెజారిటీ లేని… ఫిరాయింపులను ప్రోత్సహిస్తే తప్ప అవకాశం కూడా లేని యడ్యూరప్పకు ఆయన అవకాశం కల్పించారు. ఇది అనైతికమైన చర్య అని లోకమంతా కోడై కూస్తుండగా.. యడ్యూరప్ప బలనిరూపణకు వారంరోజుల గడువు అడిగితే ఆయన ఏకంగా రెండు వారాల గడువు ఇచ్చారు.

అక్కడితే భాజపా.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బోలెడంత సమయం ఉన్నదని సంబరపడిపోయింది. కానీ.. ఈ తరహాలో.. రాజకీయ వ్యవస్థ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నప్పుడు.. సుప్రీం కోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. యడ్డీ ప్రమాణ స్వీకారాన్ని తాము ఆపలేం అని ఏ రకంగా అయితే ప్రకటించిందో.. అదే తరహాలో రెండో రోజు సాగిన విచారణ పర్వంలో.. రెండు వారాల గడువు సాధ్యం కాదని… బలం ఉంటే గనుక.. శనివారం నాడే సభలో నిరూపించుకోవాలని ఆదేశించేసింది. ఇంత దారుణమైన భంగపాటును కమలనాయకులు ఊహించి ఉండరు. అందుకే సుప్రీం కోర్టుతో మోడీ దళానికి అహంకారభంగం జరిగిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఒకవైపు ఎమ్మెల్యేల బేరసారాలు కూడా బాగానే జోరందుకున్నాయి. జేడీఎస్, కాంగ్రెస్ లనుంచి భాజపా ఎలా బేరాలకు ప్రయత్నిస్తున్నదో.. భాజపానుంచి లాక్కోవడానికి కూడా జేడీఎస్ ప్రయత్నిస్తూనే ఉంది. ఒకవేళ భాజపా ప్రయత్నాలు సఫలం కాకపోతే గనుక.. యడ్యూరప్ప భారతదేశంలోనే అత్యల్ప కాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారిలో రెండో వ్యక్తి అవుతారు. గతంలో జగదాంబికాపాల్ యూపీ సీఎంగా ఒకరోజు ఉన్నారు. యడ్యూరప్ప తాజా ముఖ్యమంత్రిత్వం కేవలం మూణ్నాళ్ల ముచ్చట అవుతుంది. ఇక్కడ మరో సంగతి ఏంటంటే… యడ్యూరప్పకు ఇలాంటి స్వల్పకాల పదవి దక్కే చేదు అనుభవం కొత్త కాదు. గతంలో కూడా ఆయన కేవలం వారం రోజుల ముఖ్యమంత్రిగా పనిచేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.