తెలంగాణలోని ఆ స్థానాలపై ఆశలు వదులుకున్న బీజేపీ

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. విభజన హామీల విషయంలో మోసం చేసిందనే కారణంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిన ఆ పార్టీ.. తెలంగాణలో మాత్రం కొంత మేర ప్రభావం చూపే పరిస్థితి ఉంది. అందుకోసమే అక్కడే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో కలిసి పని చేసిన బీజేపీ ఈ సారి ఒంటరిగా బరిలోకి దిగాలని భావిస్తోంది. అనూహ్యంగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తుండడంతో ఆ పార్టీ కూడా మిగతా పార్టీల వలే స్పీడు పెంచేసింది. 2014లో పొత్తు కారణంగా కొన్ని సీట్లను కోల్పోవలసి వచ్చినందున నిరాశ చెందిన పార్టీ శ్రేణులు రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుండడంతో కొంత సంతోషంలో ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుడు టికెట్లు ఆశించి భంగపడిన నేతలకు ఇప్పుడు టికెట్లు దక్కే అవకాశం ఉండడంతో వారంతా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి క్యూ కడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేస్తుందట. గ్రేటర్ పరిధిలోని కొన్ని స్థానాలను బీజేపీ లైట్ తీసుకుందనే టాక్ వినిపిస్తోంది.

మజ్లిస్‌ గెలుస్తున్న ఏడు అసెంబ్లీ స్థానాలు, హైదరాబాద్‌ ఎంపీ స్థానం ఇక తమవి కానట్లుగా బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారని, వాటిపై దృష్టి పెట్టడం అనవసరం అన్నట్లుగా పార్టీ నాయకులు అనుకుంటున్నారని సమాచారం. ఆ స్థానాలు మినహా మిగిలిన వాటిలో బలమైన అభ్యర్థులను నిలుపేందుకు అధిష్ఠానం సిద్ధపడుతుందని తెలుస్తోంది. హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం కూడా అదే విధంగా ఉంది. అక్కడ నుంచి పోటీకి పెద్దగా ఆసక్తి చూపడం లేదని కొందరు పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్ర అగ్రనాయకులు హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి బలమైన అభ్యర్థిని నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇక్కడి నాయకులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అప్పట్లో హైదరాబాద్‌ ఎన్నికల్లో నరేంద్ర, బద్దం బాల్‌రెడ్డి ప్రత్యర్థులకు సింహ స్వప్నంగా నిలిచారు. నరేంద్ర మృతి చెందడం, బద్దం బాల్‌రెడ్డి పాతబస్తీకి దూరం కావడంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైంది. పార్టీ కార్యవర్గంలోని రెండు ప్రధాన కార్యదర్శి బాధ్యతలను పాతబస్తీకి చెందిన వ్యక్తికి అప్పగించాలని అగ్రనాయకులు అప్పట్లో భావించారు. సరైన వ్యక్తి లేక ఆ ప్రయత్నాలు నేటికీ ముందుకు సాగలేదు. ఈ కారణాలతోనే ఆయా స్థానాలను వదులుకుంటున్నారని టాక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.