తెలుగు హీరోయిన్‌కు బీజేపీ ఎంపీ సీటు

టాలీవుడ్‌లో పని చేసిన హీరోయిన్లలో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి తెలుగులో పాపులర్ అయిన వారే ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. తెలుగు వారిలో కూడా చాలా మంది ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే, వారిలో స్టార్స్ అయిన వారిని వేళ్లపై లెక్కపెట్టవచ్చు. ఇక, ఇప్పటి తరం వారి గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ జాబితాలో ముందుగా కలర్స్ స్వాతి గురించి మాట్లాడుకోవాలి ఆమెకు కొన్ని సక్సెస్‌లు వచ్చినా స్టార్‌డమ్‌ను మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. ఈమె తర్వాత ఇంకొంత మంది వెండితెరపై తళుక్కుమన్నా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ముఖ్యంగా మాధవీ లత, రేష్మ రాథోడ్(ఈరోజుల్లో ఫేం) వంటి వారు మొదటి సినిమాతోనే హిట్ కొట్టినా దానిని కంటిన్యూ చేయలేకపోయారు.

చివర్లో చెప్పుకున్న ఇద్దరూ కొద్దిరోజుల క్రితం రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీలో వీరు చేరిపోరి షాక్ ఇచ్చారు. ఉత్తరాదిన బలంగా ఉన్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పాగా వేయాలని ఎప్పటి నుంచో కలలు కంటోంది. ఆయా రాష్ట్రాల్లో ఎంతో కొంత ప్రభావం చూపగల కర్నాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించినా.. అధికారాన్ని మాత్రం చేపట్టలేకపోయింది. ఇక తర్వాత కొంచెం ప్రభావం చూపగల రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ అనే చెప్పాలి. విభజన హామీలు నెరవేర్చలేదనే కారణంతో ఏపీ ప్రజల దృష్టిలో దోషిగా మిగిలిపోయిన బీజేపీ.. ఆ రాష్ట్రంపై ఆశలు వదులుకోవాల్సిందే. గత ఎన్నికల్లో అరకొర సీట్లు సంపాదించుకున్న తెలంగాణలో ఈ సారి ప్రభావం చూపించాలని ఆ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది.

ఇందులో భాగంగా, వచ్చే ఎన్నికల్లో నిలబెట్టే అభ్యర్ధుల విషయంలో ఆ పార్టీ తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. దీని కోసం సినీ రంగంలోని కొందరు ప్రముఖులను తమ పార్టీలో చేర్చుకోవాలని భావించింది. దీని ప్రకారమే, మాధవీ లత, రెష్మా రాథోడ్‌లను బీజేపీలోకి ఆహ్వానించి, వారికి సుముచిత స్థానం కల్పించారు. మాధవీలత పార్టీ కండువా కప్పుకున్న తర్వాత పెద్దగా కనిపించకపోవడంతో ఆమెను కాసేపు పక్కన పెడితే.. మరో నటి రెష్మా మాత్రం బీజేపీ యువజన విభాగానికి రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికయింది. దీంతో ఆ పార్టీలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరవుతూ, పార్టీ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అధిష్టానాన్ని ఆకర్షించింది. దీంతో ఈమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించిందట.

రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన రెష్మా.. తన జిల్లా అయిన ఖమ్మంలోని వైరా నియోజకవర్గం నుంచి అసెంబ్లీపై కన్నేసింది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ స్థానాన్ని బీజేపీ వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేని కారణంగానే రెష్మా ఈ స్థానాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. వైరా నియోజకవర్గం నుంచి కాకుండా బీజీపీ అధిష్ఠానం మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ప్రొఫెసర్‌ సీతారాం గెలుపొందారు. ఈనేపథ్యంలో ఎస్టీ ఓట్లను పొందేందుకు రేష్మను బీజేపీ రంగంలోకి దించేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం. సినీతార పైగా ఈ ప్రాంత వాసులతో సంబంధబాంధవ్యాలుండటం, గిరిజన యువతి కావడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.