బీజేపీకి షాక్.. జనసేనలోకి ఆ పార్టీ ఎమ్మెల్యే

ఏపీ విభజన హామీలు అమలు చేయకపోవడంతో అక్కడి ప్రజల దృష్టిలో విలన్‌గా మిగిలిపోయింది బీజేపీ. ఈ అపవాదు పోగొట్టుకుని ఏపీలో నిలదొక్కుకోవాలని ఆ పార్టీ ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. టీడీపీతో కలిసి ఉన్నంత కాలం ఏపీలో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ.. ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ బయటికి వచ్చిన తర్వాత తన ఉనికి కోల్పోయే స్థితికి చేరుకుంది. ఇలాంటి దశలోనే ఏపీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది భారతీయ జనతా పార్టీ. ఇందులో భాగంగా ఆ పార్టీ ఏపీలో కొత్త అధ్యక్షుడిని నియమించింది. ముఖ్య నేతలతో పలు సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన సాయం గురించి ప్రజలకు వివరించాలని హిత బోధ చేస్తోంది. కానీ, ఏపీలో పుంజుకోవాలని భావిస్తున్న ఆ పార్టీకి మిగతా పార్టీలు ఛాన్స్ ఇవ్వడంలేదు. ఒక వైపు టీడీపీ.. బీజేపీపై ఎదురుదాడి చేస్తుండడంతో, ఆ నేతలు ఎక్కడా తలెత్తుకు తిరిగే పరిస్థితి కనపడడంలేదు. మరోవైపు వైసీపీ, జనసేన అధినేతలు యాత్రల పేరిట ప్రజలకు దగ్గరవుతుంటే బీజేపీ నేతలు మాత్రం తమ కార్యాలయాలకే పరిమితమై ఉండిపోతున్నారు.

ఇలాంటి దశలోనే ఏపీ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలబోతుందని వార్తలు వస్తున్నాయి. బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే త్వరలో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారట. అంతేకాదు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరబోతున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనే రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సిటీ ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌న్నారాయ‌ణ. ఆయన జనసేనలోకి వెళ్లిపోవాలని అనుకుంటున్నారని, ఆ పార్టీ తరపున రాజమహేంద్రవరం ఎంపీ స్థానానికి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా ఆకులకు రాజమహేంద్రవరం సిటీ టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికలో ఆయన వైసీపీ అభ్యర్ధి బొమ్మన రాజ్‌కుమార్‌పై 26000 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. అయితే, ఇప్పుడు ఏపీలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉండడం వల్లే ఆయన పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇప్ప‌టికే స‌త్య‌న్నారాయ‌ణ భార్య జ‌న‌సేన‌లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దాంతో బీజేపీ ఎమ్మెల్యే కూడా త్వ‌ర‌లోనే కండువా మార్చేయ‌డం దాదాపు అనివార్యంగా క‌నిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.