జగన్ ఏజెంట్ లా మాట్లాడుతున్న బీజేపీ ఎమ్మెల్యే

బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు. టీడీపీ-బీజేపీ బంధం బలంగా ఉన్న రోజుల్లో సిఎం చంద్రబాబు పాలన తీరును అభినందించేవారు. అసలు చంద్రబాబు లాంటి నేత ఉంటే ఏపీ అభివృద్ధి అందనంత స్థాయికి ఎదుగుతుందని ప్రశంసలు కురిపించారు. సభలోను అదే తీరు. కానీ ఇప్పుడు ఆరెండు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేయకుండానే భగ్గుమనేంత వైరం పెరిగింది. మోడీ పేరు చెబితేనే టీడీపీ నేతలు తిడుతున్నారు. అలానే చంద్రబాబు పేరు చెబితేనే కమలం పెద్దలు కసురుకుంటున్నారు. ఏపీని బీజేపీ నిలువునా మోసం చేసిందని టీడీపీ అంటే… కాదు కాదు ఏపీకి ఇచ్చిన నిధులను అక్రమంగా ఖర్చు చేసి ఎన్నికల కోసం బాబు కూడబెట్టుకున్నారని బీజేపీ అంటోంది. మొత్తంగా మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. 
ఇప్పుడు విష్ణుకుమార్ రాజు మాటలు మారాయి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తన భార్య అడిగితే ఏం చెప్పాలో అర్థం కావడం లేదని అసలు సంగతి చెప్పారు విష్ణు. బీజేపీని ఇరుకున పెట్టారు. హోదా కావాలనే సంగతిని చెప్పకనే చెప్పారు. అలాంటి విష్ణుకుమార్ రాజు ఇప్పుడు వైకాపాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. జాతీయ స్థాయిలో తమ పార్టీతో వైకాపా నేతలు సానుకూలంగా ఉండటమే ఇందుకు కారణమంటున్నారు. రాజకీయాలంటే ఇదే మరి. మే 15 నుంచి టీడీపీ, బీజేపీ నుంచి వైసీపీలోకి వలసలుంటాయని విష్ణుకుమార్‌రాజు చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోయిందని.. వైసీపీ గ్రాఫ్ బాగా పెరిగిపోయిందని విష్ణుకుమార్‌రాజు కొత్త సంగతి బయట పెట్టారు. 
వైకాపా అధికారంలోకి…
అసలు బీజేపీ ఎమ్మెల్యే మాటలు చూస్తే వైకాపాకు ఆయన ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారనే వాదన లేకపోలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రాదు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తే వైసీపీ కంటే 5 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయి. ఈ సారి అలాంటి కూటమి లేదు. కాబట్టి వైకాపా గెలుపు ఖాయమంటున్నారు. ఏదన్నా ఉంటే తమ పార్టీ అధికారంలోకి వస్తుంది చెప్పాలి. కానీ వైకాపా అధికారంలోకి వస్తుందని బీజేపీ నేత చెప్పడం మరింత విడ్డూరంగా ఉంది. అంటే లోపాయికారీగా ఏం జరుగుతుందో అందరికీ అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ పతనం ఖాయమని జోస్యం చెప్పారాయన. వైసీపీ గెలుపు కూడా ఖాయమని ఆ పార్టీ తరపున వకాల్తా పుచ్చుకున్నారు. ఏపీలో బీజేపీకి కాంగ్రెస్ గతే పడుతుందని అంతా అంటున్నారు. కానీ బీజేపీ మాత్రం టీడీపీ ఓడిపోతే చాలు అన్నట్లుగా ఉంది. చంద్రబాబు ఇప్పుడు తమ శత్రువు. అందుకే ఆయన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు బీజేపీ నేతలు. 
టీడీపీతో పొత్తు లేకుంటే 20 ఎమ్మెల్యేల సీట్లు, 10ఎంపీ స్థానాలు గెలిచేవాళ్లమని విష్ణుకుమార్‌రాజు తాజాగా చెప్పిన మాట. అసలు టీడీపీ లేకపోతే బీజేపీకి ఆ నాలుగు ఎమ్మల్యే, రెండు ఎంపీ సీట్లు వచ్చేవి కాదని చంద్రబాబు చెబుతున్నారు. ఫలితంగా వాస్తవాలు జనాలకు అర్థమవుతున్నాయి.  
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.