బీజేపీ నేతలూ.. కొంచెం నమ్మేలాగైనా చెప్పండి

విభజన హామీలు అమలు చేయలేదనే కారణంతో ఏపీ ప్రజల దృష్టిలో దోషిగా మారిన బీజేపీ.. తెలంగాణలో మాత్రం కొంచెం బెటర్‌గానే ఉందని చెప్పవచ్చు. రానున్న ఎన్నికల్లో కూడా ఆ పార్టీ రాష్ట్రంలో ప్రభావం చూపగలదనే పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకే తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలోగానీ, రెండు ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలుగానీ మంచిగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్రం చేసే సాయంపై లోకల్ నేతలు గట్టిగా ప్రచారం చేయాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, తెలంగాణ బీజేపీ నేతలు హుషారయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి పని చేసిన భారతీయ జనతా పార్టీ.. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. అలాగే రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లోనూ పోటీ చేయాలని అనుకుంటోంది. మరోవైపు, ముందస్తు ఎన్నికల హడావిడి రోజురోజుకూ పెరిగిపోతున్నందున ఆ పార్టీ కూడా గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకునే పనిలో పడిపోయింది. అలాగే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సాయం, కేటాయించిన నిధులను ప్రజలకు వివరించడంతో పాటు, ప్రజాకర్షక మేనిఫెస్టోను రూపొందించి ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని ఆ పార్టీ నేతలు కృషి చేస్తున్నారు.

అందుకోసం బీజేపీ తెలంగాణ నేతలు మేనిఫెస్టోలోని అంశాలపై కీలక ప్రకటన చేశారు. తాజాగా మేనిఫెస్టో ముసాయిదాపై రాష్ట్ర నాయకత్వం పార్టీ కార్యాలయంలో సోమవారం చర్చించింది. తెలంగాణ భవిష్యత్తు కోసం తమ మేనిఫెస్టో దోహదపడుతుందని చెప్పారు. రైతులు, మహిళలు, పారిశ్రామికవేత్తలు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలను భాగస్వాములుగా చేసి వినూత్న పద్ధతిలో మేనిఫెస్టో రూపొందిస్తున్నామని, ఈనెల 15కల్లా తుదిరూపం ఇస్తామని పేర్కొన్నారు. తమది ప్రజా మేనిఫెస్టో అని చెప్పాడంతో పాటు, ముసాయిదాలోని ముఖ్యాంశాలను వివరించారు. అయితే, ఈ ముసాయిదాను చూసిన చాలా మంది బీజేపీ నేతలపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు, ఇన్ని హామీలు నెరవేర్చాలంటే డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నిస్తున్నారు. ముసాయిదాలోని ఒకటైన అద్దె చెల్లింపు అంశాన్నే తీసుకుంటే పట్టణాల్లో నివశించే వారిలో ఎక్కువ మంది అద్దె ఇళ్లల్లో నివసించే వారే ఉంటారు. సో.. ఇది అసలు సాధ్యపడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ముసాయిదాలోని ముఖ్యాంశాలు
* మున్సిపాలిటీలు, మహానగరాలు, పంచాయతీల్లో నీటి పన్ను కేవలం 6 రూపాయలు.
* 59 ఎస్సీ ఉప కులాలకు సర్టిఫికెట్లు, డప్పు కొట్టేవాళ్లు, చెప్పులు కుట్టేవాళ్లకు రూ. 3వేల పింఛన్‌.
* నగరాల్లో కాలుష్య నియంత్రణకు ’పాత ఆటో, స్కూలు వ్యాను ఇవ్వండి.. కొత్తది తీసుకోండి’ పథకం అమలు.
* పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రెగ్యులేటరీ కమిషన్‌ ఏర్పాటు.
* అద్దెకు ఉంటున్న ప్రతీ కుటుంబానికి రూ. 5వేలు గరిష్ఠంగా ప్రభుత్వమే చెల్లిస్తుంది
* ఎంఎస్‌ఎంఈ, మధ్యతరహా పరిశ్రమలకు ఉచితంగా విద్యుత్తు.
* చేతి వృత్తులు, కులవృత్తులు, 60 ఏళ్లు నిండిన వ్యవసాయ కూలీలకు 3వేల వరకు పింఛన్‌.
* ప్రయివేటు విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు. ఏటా రిక్రూట్‌మెంట్‌- లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు- డిగ్రీ పైస్థాయి విద్యార్థులకు ఉచిత ల్యాప్‌ట్యాప్‌లు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.