ఎమ్మెల్యేలే ఒప్పుకున్నారు.. మిగతా వాళ్ల సంగతేంటి..?

‘‘ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన మూడు హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదు. ప్రజల భావోద్వేగాలను పట్టించుకోకపోవడం వల్ల సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ బీజేపీ ప్రజాదరణ పొందలేకపోయింది’’ ఇటీవల పార్టీని వీడే సమయంలో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చేసిన కామెంట్స్ ఇవీ. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి బాగోలేదు.. ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఏపీ హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు ఇక్కడి ప్రజలు కోపంతో ఉన్నారు’’ తాజాగా భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు చేసిన వ్యాఖ్యలివి. వీళ్లిద్దరే కాదు రాష్ట్రంలోని చాలా మంది బీజేపీ నేతల మనసులో ఉన్న అభిప్రాయం ఇది. కానీ, ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎవరూ గీత దాటడంలేదు. అందుకే తమ తప్పులున్నా కప్పిపుచ్చుకుంటూనే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఒకవైపు కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ తప్పు చేసిందని చెబుతున్నా.. మరికొందరు సమర్ధించాల్సి వస్తోంది. దీంతో వారిపైనా వ్యతిరేకత వస్తోంది.

ముఖ్యంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్యే మాణిక్యాలరావు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తదితర నేతలు ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేసి కామెంట్లు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి పైడికొండల మాణిక్యాలరావు, కృష్ణా జిల్లా కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం సిటీ నుంచి ఆకుల సత్యనారాయణలు బీజేపీ తరపున శాసనసభకు ఎన్నికైన వారిలో ఉన్నారు. వీరిలో ఒకరైన ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, కామినేని తెలుగుదేశం పార్టీలో చేరుతారని కొంత కాలంగా వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.