దక్షిణాది పై దృష్టి సారించిన బీజేపీ 

వరుసగా తగులుతున్న దెబ్బలతో డీలా పడ్డ బీజేపీ.. 2019 ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురవడంతో బీజేపీకి ఎన్నికల భయం పట్టుకుంది. ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ నిష్క్రమించిన తర్వాత బీజేపీ పరిస్థితి దారుణంగా తయారయింది. అంతేకాదు బీజేపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన జీఎస్టీ బిల్లు, నోట్ల రద్దు, చమురు ధరల పెరుగుదల వంటి వాటి వల్ల ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో మిత్ర పక్షాలను పక్కనే ఉంచుకుని, మిగతా ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకుని పోవాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం.. ముందస్తు ఎన్నికల కోసం ప్రణాళికలు రూపొందిస్తోంది.

అది కుదరని పక్షంలో ప్రత్యమ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు బీజేపీ కన్ను దక్షిణాది రాష్ట్రాలపై పడింది. వాటిలో బీజేపీకి కొంచెమైనా బలమున్న రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది కర్నాటకే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధించినా ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో బీజేపీ మరో సంచలన నిర్ణయం తీసుకుందని సమాచారం. 2019 లోకసభ ఎన్నికల్లో దక్షిణాదిన అత్యధిక స్థానాలు కైవశం చేసుకునే ఏకైక అవకాశం ఉన్న కర్ణాటకలో, అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోరాదని బీజేపీ నిర్ణయించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సోమవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప భేటీ అయిన సందర్భంగా ఇదే అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. 

లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కలసికట్టుగా బరిలోకి దిగే అవకాశం ఉండడంతో బీజేపీ కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఆయా సామాజికవర్గాలు అధికంగా ఉన్న ప్రముఖ నియోజకవర్గాలలో అదే సామాజికవర్గానికి చెందిన ముఖ్యనేతలను రంగంలోకి దించాలని భావిస్తోంది.
మండ్య లోకసభ నియోజకవర్గం నుంచి మాజీ ఉపముఖ్యమంత్రి ఆర్‌.అశోక్‌ పేరు తెరపైకి వచ్చింది. రాష్ట్ర రాజకీయాల్లో తనకు అడ్డుగా ఉన్న అశోక్‌ను తొలగించుకోవడంతోపాటు ఆయనను లోకసభకు పంపాలని యడ్యూరప్ప పావులు కదుపుతున్నట్లు తెలిసింది. కనీసం ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలకు ఈసారి ఎంపీ టికెట్‌లు కేటాయించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలను ఉటంకిస్తూ తెలిసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.