బీజేపీ నేత‌కు చేదు అనుభ‌వం..

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి దయనీయంగా తయారయ్యింది.. బీజేపీ పేరెత్తితేనే జనం మండిపడుతున్నారు.. ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్న కోపం ప్రజల్లో నెలకొంది.. అయితే ఆరిపోతున్న దీపానికి కాసింత చమురు అందించే ప్రయత్నంలో పడ్డారు ప్రధాని నరేంద్రమోదీ.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. ఇందుకోసం వరుస కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.. బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎంపీలు వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి విస్తృత ప్రచారం చేయాలట! కేంద్రం బోలెడన్ని నిధులు ఇస్తోందనీ… ఏపీ ప్రభుత్వం తప్పిదాల వల్లే నిధులు రాకుండా ఆగిపోయాయని జనానికి చెప్పాలట! ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలను కలుసుకుని ఏపీకి చేసిన మేళ్లను వివరించాలట! ఇలా ఇచ్చిన బాధ్యతలను ఎంపీలు.. ఎమ్మెల్యేలు సక్రమంగా నిర్వర్తించాక కేంద్రమంత్రులను ఏపీకి పంపించాలన్నది బీజేపీ హైకమాండ్‌ ఆలోచనట!అసలు విషయానికి వస్తే ఎప్పుడూ నెల్లూరు వైపు కన్నెత్తి కూడా చూడని కమలం పార్టీ ఎంపీ గోకరాజు గంగరాజు అకస్మాత్తుగా సింహపురిలో వాలిపోయారు. విశేష్‌ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగానే గోకరాజు నెల్లూరుకు వచ్చారని బీజేపీ వాళ్లే చెప్పారు. ఈ క్రమంలోనే నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి అతిథిగృహంలో గోకరాజు గంగరాజు సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడ రామ్‌కుమార్‌రెడ్డి గురించి క్లుప్తంగా చెప్పుకోవాలి.. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి పెద్దకుమారుడే ఈయనే! జనార్దన్‌రెడ్డి నలుగురు కుమారుల్లో రామ్‌కుమార్‌ ఒక్కరే రాజకీయాల్లోకి వచ్చారు.. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున వెంకటగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.. కనీసం డిపాజిట్‌ కూడా రాలేదు.. ఆ తర్వాత అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ద్వారా బీజేపీలో చేరారు.. మొన్నామధ్య ప్రెస్‌మీట్‌ పెట్టి బీజేపీ తీరు బాగోలేదని విమర్శించారు.. రెండు మూడు నెలలలో పార్టీ మారతారని.. ఏ పార్టీలోకి వెళతానో అప్పుడే చెబుతానని …అయితే వెంకటగిరిని మాత్రం విడిచిపెట్టనని చెప్పుకొచ్చారు.. అప్పటి నుంచి రామ్‌కుమార్‌ టీడీపీలోకి వెళతారా..? లేక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి వెళతారా అని జనం ఎదురుచూడసాగారు.. సడన్‌గా గోకరాజు గంగరాజును రామ్‌కుమార్‌ తన గెస్ట్‌హౌజ్‌కు తీసుకెళ్లడంతో జనం విస్తుపోయారు.. ఈ సమావేశానికి జిల్లాలోని ప్రముఖ విద్యాసంస్థల అధినేతలు కూడా వచ్చారు. ఇక సమావేశంలో గోకరాజు బీజేపీ గొప్పదనాన్ని.. నరేంద్రమోదీ ఏపీకి చేసిన మేళ్ల గురించి పెద్ద ప్రసంగమే చేశారు.. ఆ తర్వాత పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.. చివర్లో పార్టీ నేతలు.. ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలతో కలిసి ఓ ఇంట్లో సమావేశమయ్యారు.
అక్కడ గంగరాజుకు షాకుల మీద షాకులు తగిలాయి.. ఆయన స్పీచ్‌ స్టార్ట్‌ చేయగానే… సమావేశానికి వచ్చిన వారంతా అంతెత్తున లేచారు.. ఏపీకి బీజేపీ ఏం చేసిందండీ.. అంటూ సూటిగానే ప్రశ్నించారు.. నోట్ల రద్దు.. జీఎస్టీ కారణంగా జనం ఇంకా  ఇబ్బందులు పడుతున్నారని.. పైగా పెట్రో ధరలు అమాంతం పెంచేయడంతో ప్రజలు పార్టీని తిట్టిపోస్తున్నారని గంగరాజుకు గట్టిగానే చెప్పారు. అమరావతికి నిధులు ఎందుకు ఇవ్వరు..? కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఎందుకు అనుమతి ఇవ్వరు..? విశాఖ రైల్వే జోన్‌ సంగతేమిటి..? పోలవరం నిధుల మాటేమిటి..? ఇలా  ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి గంగరాజుకు దిమ్మతిరిగే షాకిచ్చారు.. సమావేశానికి వచ్చినవారంతా ఉన్నత విద్యావంతులే! ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉన్నవారే!  సమావేశం వేడెక్కడంతో అక్కడ ఉన్న కొందరు బీజేపీ నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.. ఇప్పుడు ఇవన్నీ వద్దు.. బయట మీడియా ఉందని అని చెప్పి సమావేశాన్ని ముగించారు. సమావేశానికి వచ్చిన వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం గంగరాజు వల్ల కాలేదు.. పైగా వారి కోపాన్ని తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేశారు.. కేంద్రంలో మోదీ.. ఏపీలో చంద్రబాబు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.. చంద్రబాబు పాలన భేష్‌ అన్నారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయ్యాక నిధులు రావడం లేదని అనుకోవద్దని.. రేపు ఆయన రాష్ట్రపతి అయితే మనందరికీ గర్వకారణమే కదా ముక్తాయించారు.. టైమ్‌ అయిపోయింది.. మళ్లీ కలుద్దాం అంటూ వెళ్లిపోయారు. మొత్తంమీద ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో నెల్లూరు పర్యటన తర్వాత గోకరాజు గంగరాజుకు అర్థమయ్యి ఉంటుంది.. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.