బాబును హీరో అన్న బీజేపీ..! అదీ గ్రేట్‌నెస్!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్ష పై దేశంలోని అన్ని జాతీయ పార్టీల నేతలు మద్దతు తెలుపుతున్నారు. ఏపీ కి బీజేపీ చేసిన అన్యాయాన్ని బాబు ప్రశ్నిస్తుండటం భేష్ అంటూ ఈ ధర్మపోరాట దీక్ష సంఘీభావం తెలుపుతున్నారు. విభజన చట్టం లోని హామీలను అమలు చేయకుండా బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతున్నారు. అయితే ఈ దీక్షకు హాజరైన బీజేపీ నేతలే స్వయంగా చంద్రబాబును హీరో అని ప్రస్తావించటం హాట్ టాపిక్ అవుతోంది.

న్యూఢిల్లీలో జరుగుతున్న ధర్మపోరాట దీక్షకు హాజరైన బీజేపీ అసమ్మతి నేతలు శత్రుఘన్ సిన్హా, యశ్వంత్ సిన్హా చంద్రబాబును తెగ పొగిడారు. వేదికపై మాట్లాడిన శత్రుఘన్ సిన్హా.. చంద్రబాబును ‘ఆంధ్రా హీరో.. హీరో ఆఫ్ ది నేషన్’ అనేయటంతో సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. తాము పార్టీకి హాని చేసే కార్యకలాపాలేవీ చేయడం లేదని, అన్యాయానికి వ్యతిరేకంగా తమ గొంతు వినిపిస్తామని ఈ సందర్బంగా శత్రుఘన్ సిన్హా వెల్లడించారు. వ్యక్తి కంటే పార్టీ గొప్పదని, అలాగే పార్టీ కంటే దేశం గొప్పదని ఆయన చెప్పారు. దేశంలో జరుగుతున్న పరిణామాల విషయమై తాము ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన పార్టీని అవమానించినట్లు కాదని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అనేది ఏపీకి సంబంధించిన అంశం కాదని, ఇది దేశానికి సంబంధించిన అంశమని సిన్హా అన్నారు. వేదికపై.. తాను ఇంకా పార్టీ ఎంపీనని ఆయన పేర్కొనటం గమనార్హం.

ప్రత్యేక హోదా ఇస్తామని చేసిన మోసాన్ని మరోసారి వెలుగెత్తి చాటుతూ చంద్రబాబు చేపట్టిన ఈ ధర్మపోరాట దీక్షకు దేశంలోని కీలక నాయకులతో పాటు అన్ని పార్టీల మద్దతు లభిస్తుండటం పైగా స్వయంగా బీజేపీ నేతల మద్దతు కూడా లభించటంతో తెలుగు తమ్ముళ్లలో సరికొత్త హుషారు తీసుకొచ్చింది. మరోవైపు.. ఇచ్చిన మాట తప్పిన ప్రభుత్వాన్ని ఢిల్లీ వేదికగా చంద్రబాబు ప్రశ్నిస్తుండటం అభినందించదగిన విషయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఈ వేదికపై మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏపీ పట్ల మోడీ తీరుపై చెడుగుడు ఆడారు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.