హరిబాబు మాటే దిక్కరిస్తున్న బీజేపీ నాయకులు..!

కేంద్రం ఇచ్చిన పథకాలను చంద్రబాబు ప్రభుత్వం తనవిగా ప్రచారం చేసుకుంటోంది. ఏపీకి చాలా ఇచ్చినా ఏం ఇవ్వలేదని చెబుతోంది. అసలు జనాల దృష్టిలో బీజేపీని విలన్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికైనా మేలుకోక పోతే ఏపీలో బీజేపీ కోలుకోలేదనేది ఆ పార్టీ కార్యకర్తల అభిప్రాయంగా ఉంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా వెళ్లడం మన విధానం కాదు. మీరంతా సంయమనం పాటించండి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళదాం. మరోవైపు బీజేపీ అగ్రనేతలు కార్యకర్తలకు ఇచ్చిన సమాధానం. ఆ సమాధానం వారిని సంతృప్తి పరచలేదు. అందుకే అగ్రనాయత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురేశారు. ఫలింతగా క్రమశిక్షణ కలిగిన బీజేపీలో కలకలం రేగుతోంది. 
                    సీఎంపై ఎదురుదాడికి దిగాల్సిన అవసరం ఉందని విజయవాడలో జరిగిన బీజేపీ కార్యవర్గ భేటీలో కొందరు నేతలు పట్టుపట్టారు. ఇందుకు  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీ అధ్యక్షుడు కె.హరిబాబు ఒప్పుకోలేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి చేసిందో తెలిపే తొమ్మిది పేజీల బుక్‌లెట్‌ను వారికి ఇచ్చారు హరిబాబు. అది చూసిన చాలా మంది నేతలు ఆయనపై మండిపడ్డారు. మీరు పార్టీ నుండి మమ్ములను సస్పెండ్ చేసుకోండి. కానీ బీజేపీకి టీడీపీ అన్యాయం చేస్తోందని, దాన్ని ప్రజలముందు బయటపెట్టాల్సిందేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ చూశాక చంద్రబాబు ఏ జిల్లాకు నిధులు తక్కువ కేటాయిస్తే ఆ జిల్లా నుంచి మనం దాడి మొదలు పెడదామని నేతలు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది.
                     హరిబాబుపై కృష్ణా జిల్లా పార్టీ నేత, లక్ష్మీపతి రాజా, విజయనగరం జిల్లా నేత సన్యాసి రాజు, గోదావరి జిల్లాలకు చెందిన నేతలు, తిరుపతికి చెందిన మహిళా నాయకురాలు నిప్పులు చెరిగారు. కేంద్రం ఏమిచ్చిందో చెప్పకుండా టీడీపీ నాలుగేళ్లుగా ఏమి చేసింది. ఇప్పుడు కావాలని ఎదురు దాడి చేస్తే ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ‘నాలుగేళ్లుగా నిద్రపోతున్నారా? చంద్రబాబును అప్పుడు అదుపు చేసి ఉండాల్సింది.. కేంద్ర బడ్జెట్‌ తర్వాత ప్రజల్లో బీజేపీని ఆయన విలన్‌ను చేశారు’ అని లక్ష్మీపతి రాజా మరింత ఘాటుగా మాట్లాడటంతో కార్యవర్గ భేటీ వాడి వాడిగా మారింది. కేంద్రం ఏమీ ఇవ్వలేదని తెలుగుదేశం రాజకీయంగా మనల్ని ఇరుకునపెట్టిందని సన్యాసిరాజు అన్నారు. 
                       ఉనికి కోసం కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు బంద్‌కు పిలుపిస్తే మన మిత్రపక్షమైన టీడీపీ ఎందుకు పాల్గొందని వారు ప్రశ్నించారు. వారి గురించి మనకెందుకు. మన పార్టీ గురించి మాట్లాడుకుందామని హరిబాబు చెప్పడంతో మరింతగా నేతలు మండి పడ్డారు. ‘మాకు కడుపులో మండుతోందంటే మీరు తలనొప్పికి మందిస్తున్నారు. ఇది పద్దతిగా లేదని నేతలు ఎదురు తిరిగారు. ఇక లాభం లేదనుకున్న హరిబాబు లక్ష్మీపతి రాజా మైకు కట్‌ చేయించారు. ఆగ్రహాంతో ఊగిపోయిన ఆయన చేతిలోని మైకును నేలకేసి కొట్టారు. మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌ రాజు, ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పురందేశ్వరి తదితరులు వారిని శాంతింప జేశారు. 
                    హరిబాబు పై ఇంత తీవ్ర స్థాయిలో మాటల దాడి జరుగుతుందని ఊహించలేదు. ఫలితంగా ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితికి వెళ్లారు కంభంపాటి. మరోవైపు హైకమాండ్ కు ఈ భేటీ సమాచారం వెళ్లడంతో వాస్తవం ఏంటనే వైనం పై ఆరా తీసిందట.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.