ఏపీలో బీజేపీ సత్తా అప్పుడు… ఇప్పుడు ఎంత?

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ టి రామారావు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు నడుం బిగించడంతో భారతీయ జనతా పార్టీ టీడీపీ మధ్య అవగాహన కుదిరింది. చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేపట్టిన తర్వాత 90వ దశకం చివర్లో అటల్ బిహారీ వాజపేయి ఆధ్వర్యంలోని బీజేపీకి చేరువయ్యారు. దీంతో కొన్నేళ్లపాటు బీజేపీ టీడీపీ దోస్తీ సాగింది. టీడీపీ లోక్ సభ స్పీకర్ పదవి కూడా తీసుకుంది. 2002లో గుజరాత్ అల్లర్ల తర్వాత ఉభయ పార్టీల మధ్య స్నేహసంబంధాలు దెబ్బతిన్నాయి. 2014 జూన్ 2 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయింది. 2014 మే లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ విభజన, నరేంద్ర మోడీ ప్రభంజనం నేపథ్యంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మళ్లీ బీజేపీ వైపు మొగ్గు చూపారు. అటు బీజేపీ, ఇటు జనసేన పార్టీల మద్దతుతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాగలిగారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం తో పొత్తు కారణంగా భారతీయ జనతా పార్టీ 9 అసెంబ్లీ స్థానాలను, 3 పార్లమెంటు స్థానాలను గెలుచు కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ సాధించిన అతి పెద్ద విజయం అది. నిజానికి ఆంధ్రలో బీజేపీ నాలుగు స్థానాల్లో పోటీ చేసినా, కేవలం రెండు స్థానాల్లో నెగ్గింది. విశాఖ పట్నం నుంచి హరిబాబు, నర్సాపురం నుంచి గోకరాజు గంగరాజు, విజయం సాధించగా, రాజం పేట నుంచి పోటీ చేసిన దగ్గుబాటి పురంధేశ్వరి, తిరుపతి నుంచి పోటీ చేసిన కారుమంచి జయరాం ఓటమి పాలయ్యారు. సికింద్రాబాద్ లో బండారు దత్తాత్రేయ విజయం సాధించారు. తెలంగాణలో బీజేపీ నెగ్గిన ఏకైక పార్లమెంటు సీటు అది.టీడీపీతో పొత్తు కారణంగానే, ఎమ్మెల్సీ పదవులు అందుకోగలిగింది. ఇద్దరు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా సమస్యపై తెలుగుదేశం బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. 
భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా అన్ని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే సామర్థ్యం కానీ, విజయం సాధించగల నాయకులు గానీ, కార్యకర్తల బలం కానీ లేదనేది సుస్పష్టం. అర్బన్ పార్టీగా పేరొందిన బీజేపీకి కొన్ని నగరాలలోనే కార్యకర్తల బలం ఉంది. ఆర్ ఎస్ ఎస్ , సంఘ్ పరివార్ సంస్థల బలాన్నికూడగట్టుకున్నా గ్రామీణ ప్రాంతాల్లో బలం లేనందువల్ల ఒంటరిగా నెగ్గే అవకాశాలు దాదాపు మృగ్యమే. ఒక దశలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, పవన్ కల్యాణ్ జనసేన, జగన్ వైసీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం జరిగినా, ప్రస్తుతం ఆ అవకాశాలు కన్పించడం లేదు. పెద్దగా కేడర్ లేని బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్, జనసేనతో పంచ ముఖ పోటీలలో ఏమేరకు నెగ్గుకు రాగలదో చూడాలి. మరోవైపు 500, వెయ్యి నోట్ల రద్దు, జీఎస్టీతో జనం పై పడిన అదనపు భారం, రోజురోజుకూ పెరిగి పోతున్న నిత్యావసర ధరలు, మండి పోతున్న పెట్రోలు ధరలు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం తీసుకువచ్చి ప్రతి భారతీయుడి ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తామంటూ నరేంద్ర మోడీ ఎన్నికల వాగ్దానం వట్టి మాటలే అని తేలిపోయాయి. ఈ నేపధ్యంలో ఏపీలో బీజేపీ విజయం సాధించేందుకు ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.