బీజేపీ అశ్వ‌మేధ యాగం క‌ర్ణాట‌క‌లో ఆగింది 

బీజేపీపై నిప్పులు చెరిగారు జేడీయూ నేత కుమార‌స్వామి. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల కావ‌టం.. ఏ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ రాని వేళ‌.. జేడీయూ.. కాంగ్రెస్ కూట‌మి అధికార ప‌గ్గాలు చేపట్టేందుకు సిద్ధం కావ‌టం తెలిసిందే. దీనికి కౌంట‌ర్ గా జేడీఎస్ ను చీల్చ‌టం ద్వారా బీజేపీ ప‌వ‌ర్లోకి వ‌చ్చే దిశ‌గా పావులు క‌దుపుతోంది.
ఇదిలా ఉంటే.. బీజేపీ తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు కుమార‌స్వామి. త‌మ పార్టీని చీల్చేందుకు బీజేపీ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుందంటూ నిప్పులు చెరిగిన ఆయ‌న‌.. ఆ పార్టీపై తీవ్రంగా ధ్వ‌జ‌మెత్తారు. త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని బీజేపీ లాగే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని ఆరోపించారు. 
ఈ ప్ర‌య‌త్నంలో భాగంగా ఒక్కో ఎమ్మెల్యే కు  రూ.100 కోట్ల తో పాటు.. మంత్రి ప‌ద‌విని బీజేపీ ఆఫ‌ర్ చేస్తుంద‌న్నారు. ఇంత న‌ల్ల‌ధ‌నం క‌మ‌ల‌నాథుల‌కు ఎక్క‌డి నుంచి వ‌స్తుందంటూ సూటిగా ప్ర‌శ్నించారు. ఇన్ కం ట్యాక్స్ అధికారులు ఎక్క‌డికి పోయార‌ని విరుచుకుప‌డ్డారు. బీజేపీ చేప‌ట్టిన అశ్వ‌మేధ యాగం ఉత్త‌రాదిన మొద‌లైంద‌ని.. క‌ర్ణాట‌క‌లో వారి గుర్రాలు ఆగిపోయిన‌ట్లుగా చెప్పారు. అశ్వ‌మేధ యాగాన్ని ఆపివేయాల‌నే విష‌యాన్ని క‌ర్ణాట‌క ఫ‌లితాలు స్ప‌ష్టం చేసిన‌ట్లుగా గుర్తు చేసిన కుమార‌స్వామి.. బీజేపీ అధినాయ‌క‌త్వానికి సూటిగా వార్నింగ్ ఇచ్చేశారు. 
తమకు చెందిన ఒక  గుర్రాన్ని లాగితే.. బీజేపీకి చెందిన రెండు గుర్రాల్ని లాగేస్తామ‌న్నారు. గ‌తంలో తన మ‌ద్ద‌తు కోసం బీజేపీ ప్ర‌య‌త్నించింద‌న్న కుమార‌స్వామి.. అప్ప‌ట్లో తాను మొగ్గు చూప‌టంతో త‌న తండ్రి మీద మ‌చ్చ ప‌డింద‌న్నారు. తాజాగా తాను ఆ మ‌చ్చ‌ను తుడిచి వేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌న్నారు. బీజేపీ ఒక్క ఎమ్మెల్యే లాగే ప్ర‌యత్నం చేసినా తాము ఇద్ద‌రిని లాగుతామ‌న్న ఆయ‌న‌.. త‌మ‌కు బీజేపీ ఎమ్మెల్యేలు కొంద‌రు ట‌చ్ లో ఉన్నారంటూ కొత్త బాంబు పేల్చారు. 
గ‌తంలో తాను బీజేపీతో న‌డిచిన సంద‌ర్భంలో త‌న తండ్రి మీద మ‌చ్చ ప‌డింద‌ని.. దాన్ని తొల‌గించుకునే అవ‌కాశం త‌న‌కు ఇప్పుడు ల‌భించింద‌న్నారు. అందుకే.. తాను కాంగ్రెస్‌తో వెళుతున్న‌ట్లుగా కుమార‌స్వామి స్ప‌ష్టం చేశారు. గుర్రాల వ్యాపారాన్ని ప్రోత్స‌హించేలా వ్య‌వ‌హ‌రించొద్ద‌ని గ‌వ‌ర్న‌ర్ ను కోరుతున్న‌ట్లు చెప్పారు. 
ఈ సంద‌ర్భంగా మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు కుమార‌స్వామి ఆస‌క్తిక‌రంగా రియాక్ట్ అయ్యారు. బీజేపీ క‌ర్ణాట‌క ఇన్ ఛార్జ్ ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ ను క‌లిశారా? అన్న ప్ర‌శ్న‌కు.. ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ ఎవ‌రంటూ ఎదురుప్ర‌శ్న‌ను సంధించారు. తాను జ‌వ‌దేక‌ర్ ను క‌ల‌వ‌లేద‌ని.. బోగ‌స్ వార్త‌ల్ని తెర మీద‌కు తెస్తున్నార‌న్నారు. తాను కేపీసీసీ అధ్య‌క్షుడు ప‌ర‌మేశ్వ‌ర‌తో క‌లిసి గ‌వ‌ర్న‌ర్ ను మ‌రోసారి క‌ల‌వ‌నున్న‌ట్లు చెప్పారు.
ఇదిలా ఉండ‌గా.. జేడీఎస్ కు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు తాజాగా నిర్వ‌హించిన భేటీ రాలేద‌న్న స‌మాచారం క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ఇద్ద‌రు జేడీఎస్ ఎమ్మెల్యేలు రియాక్ట్ అయ్యారు. తాము డుమ్మా కొట్ట‌లేద‌ని.. తాము ఎక్క‌డికి పోలేద‌ని స్ప‌ష్టం చేశారు. కుమార‌న్న‌తోనే తాము ఉండ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. 
ఈ రోజు ఉద‌యం జ‌రిగిన జేడీఎస్ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశానికి మొత్తం 38 మంది ఎమ్మెల్యేల‌కు 36 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే హాజ‌రు కాలేదు. దీంతో.. జేడీఎస్ నుంచి ఇద్ద‌రు ఎమ్మెల్యేలు జారిపోయిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. కానీ.. అలాంటిదేమీ లేద‌ని.. తాము బెంగ‌ళూరుకు 450 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటామ‌ని.. స‌మ‌యానికి రాలేక‌పోయామే త‌ప్పించి ఎక్క‌డ‌కు పోలేద‌న్నారు. బెంగ‌ళూరు ట్రాఫిక్ స‌మ‌స్య గురించి తెలిసిందే క‌దా? అంటూ ప్ర‌శ్నించిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు తాము జేడీఎస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లేది లేద‌ని తేల్చి చెప్పారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.